Nandigama News: ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో మాంసం ప్రియులకు మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు. స్థానికంగా డయేరియా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారం రోజుల పాటు మాంసం విక్రయాలపై పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చందాపురం ప్రాంతంలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ కఠిన చర్యలు చేపట్టాల్సి వచ్చిందని అధికారులు స్పష్టం చేశారు.
నందిగామ మున్సిపల్ పరిధిలోని చందాపురంలో గత కొన్ని రోజులుగా డయేరియా కేసులు నమోదవుతున్నాయి. కలుషిత ఆహారం, నీరు వల్ల ఈ వ్యాధి మరింత ప్రబలే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ లోవరాజు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణంలోని అన్ని చికెన్ సెంటర్లు, మటన్ షాపులు, చేపల మార్కెట్లు ఏప్రిల్ 8వ తేదీ వరకు మూసివేయాలని ఆదేశించారు.
కేవలం మాంసం విక్రయాలకే కాకుండా, హోటళ్లు రోడ్డు పక్కన ఉండే కర్రీ పాయింట్లపై కూడా ఈ ఆంక్షలు వర్తిస్తాయని కమిషనర్ స్పష్టం చేశారు. హోటళ్లలో నాన్-వెజ్ వంటకాలు వండరాదని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి దొంగచాటుగా విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా చికెన్, మేక, గొర్రె చేపల విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని వ్యాపారులకు సూచించారు.
పట్టణ ప్రజల ప్రాణరక్షణే తమకు ముఖ్యమని, డయేరియాను అరికట్టడానికి ప్రజలందరూ సహకరించాలని అధికారులు కోరుతున్నారు. ప్రజలు కూడా బయట దొరికే మాంసం వంటకాలకు దూరంగా ఉండాలని, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. పారిశుద్ధ్య లోపం లేకుండా మున్సిపల్ సిబ్బంది ఇప్పటికే చందాపురంతో పాటు మిగిలిన వార్డుల్లో బ్లీచింగ్ చల్లడం, క్లోరినేషన్ చేయడం వంటి పనులు వేగవంతం చేశారు.
ఈ నిషేధం ఏప్రిల్ 8 వరకు అమల్లో ఉంటుందని, అప్పటివరకు మాంసం వ్యాపారులు తమ దుకాణాలను తెరువకూడదని మున్సిపల్ యంత్రాంగం మరోసారి స్పష్టం చేసింది. అధికారుల ఆకస్మిక తనిఖీలు కూడా ఉంటాయని, నిబంధనలు మీరితే జరిమానాలతో పాటు షాపుల లైసెన్సులను రద్దు చేస్తామని మున్సిపల్ కమిషనర్ లోవరాజు హెచ్చరించారు.