అధునిక సాంకేతిక యుగంలో వైర్‌లెస్ పరికరాలు మన రోజువారీ జీవితంలో విడదీయరాని భాగంగా మారాయి. ముఖ్యంగా బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌లు ఆఫీస్ పనులు, ఆన్‌లైన్ మీటింగ్స్, సంగీత వినోదం, సోషల్ మీడియా వినియోగం వంటి అవసరాల కోసం గంటల తరబడి చెవుల్లోనే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌ల వాడకం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా, ముఖ్యంగా క్యాన్సర్‌కు కారణమవుతుందా అనే సందేహాలు చాలామందిలో తలెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై భిన్నమైన వాదనలు వైరల్ అవుతూ ప్రజల్లో గందరగోళాన్ని పెంచుతున్నాయి.
కొంతమంది బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌లు చెవుల్లో పెట్టుకోవడం అంటే తల దగ్గర మైక్రోవేవ్‌ను పట్టుకున్నట్లేనని చెబుతున్నారు. అయితే నిపుణులు ఈ వాదనలను ఖండిస్తున్నారు. ఈ గందరగోళానికి స్పష్టత ఇవ్వడానికి అమెరికాలోని మిచిగాన్ న్యూరోసర్జరీ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ జే జగన్నాథన్ ఇటీవల ఒక వీడియో ద్వారా శాస్త్రీయ ఆధారాలతో వివరించారు. అక్టోబర్ 13, 2025న సోషల్ మీడియాలో విడుదలైన ఈ వీడియోలో, బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌లపై వస్తున్న భయాలను ఆయన సూటిగా తప్పుబట్టారు.
డాక్టర్ జగన్నాథన్ చెప్పిన ప్రకారం, బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌ల నుంచి వెలువడే రేడియేషన్ ‘నాన్ అయనైజింగ్ రేడియేషన్’ కేటగిరీలోకి వస్తుంది. ఈ రకం రేడియేషన్ మన శరీరంలోని డీఎన్‌ఏను దెబ్బతీయగల సామర్థ్యం కలిగి ఉండదని ఆయన స్పష్టం చేశారు. డీఎన్‌ఏకు నష్టం కలగనప్పుడు క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు నేరుగా కారణమవుతుందని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని తెలిపారు.
మరో ముఖ్యమైన అంశంగా, బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌ల నుంచి విడుదలయ్యే రేడియేషన్ స్థాయి మొబైల్ ఫోన్‌లతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, ఎయిర్‌పాడ్‌లు వంటి వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌ల రేడియేషన్ స్థాయి మొబైల్ ఫోన్‌ల కంటే 10 నుంచి 400 రెట్లు తక్కువగా ఉంటుంది. మొబైల్ ఫోన్ వినియోగం వల్లనే క్యాన్సర్‌కు స్పష్టమైన ఆధారాలు లేనప్పుడు, ఇయర్‌ఫోన్‌ల వల్ల ప్రమాదం ఇంకా తక్కువేనని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
ఈ అంశంలో తరచుగా ప్రస్తావనకు వచ్చే పరిశోధన నేషనల్ టాక్సికాలజీ ప్రోగ్రామ్ నిర్వహించిన అధ్యయనం. ఈ పరిశోధనలో ఎలుకలను ఎక్కువ కాలం రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్‌కు గురి చేశారు. ఈ ప్రయోగంలో మగ ఎలుకలలో కొన్ని అరుదైన గుండె సంబంధిత క్యాన్సర్ కేసులు స్వల్పంగా పెరిగినట్లు గుర్తించారు. అయితే ఆడ ఎలుకలలో అలాంటి ప్రభావం కనిపించలేదు.
ఈ పరిశోధనను తరువాత అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సమీక్షించింది. ఈ అధ్యయనం ఆధారంగా మానవుల్లో రేడియేషన్‌కు, క్యాన్సర్‌కు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని నిరూపించలేమని ఎఫ్‌డీఏ స్పష్టంగా తెలిపింది. ప్రయోగాల్లో ఎలుకలకు ఇచ్చిన రేడియేషన్ మోతాదు, సాధారణంగా మనం రోజువారీ జీవితంలో మొబైల్ ఫోన్లు లేదా బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌ల ద్వారా ఎదుర్కొనే స్థాయికి భిన్నమని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుత శాస్త్రీయ ఆధారాల ప్రకారం, బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌ల వాడకం వల్ల క్యాన్సర్ వస్తుందని నిర్ధారించడం సరైంది కాదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఏ పరికరం అయినా అవసరానికి మించి వాడకుండా, మధ్య మధ్యలో విరామం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అని, ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాల కోసం వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.