దేశంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) సేవలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) కూడా ఈ రంగంలోకి అడుగుపెట్టింది. ఫేస్బుక్ మాతృసంస్థ మెటాతో కలిసి రిలయన్స్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్ అనే అనుబంధ సంస్థ ద్వారా రిలయన్స్ ఎంటర్ప్రైజ్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్ (REIL) అనే జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ప్రధానంగా ఎంటర్ప్రైజ్ AI సేవల అభివృద్ధి, మార్కెటింగ్ పై దృష్టి సారించనుంది.
ఇక మరోవైపు టెక్ దిగ్గజం గూగుల్ హిందూ మహాసముద్రంలో ఓ రహస్య ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ నిర్మిస్తోందనే వార్తలు చర్చనీయాంశమయ్యాయి. రాయిటర్స్ కథనం ప్రకారం ఆస్ట్రేలియాకు సమీపంలోని క్రిస్మస్ ఐలాండ్‌లో ఈ సెంటర్ నిర్మాణం జరుగుతోంది. ఇది ఆస్ట్రేలియా సైన్యంతో కుదిరిన క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందానికి సంబంధం ఉన్నట్లు సమాచారం.
క్రిస్మస్ ఐలాండ్ ప్రాజెక్ట్ కోసం గూగుల్ 7 మెగావాట్ల డేటా సెంటర్ నిర్మాణాన్ని ప్రతిపాదించింది. దీనికి అవసరమైన ఇంధన సరఫరా కోసం డీజిల్, పునరుత్పాదక శక్తి వనరులను ఉపయోగించనుంది. ఈ ద్వీపాన్ని ఆస్ట్రేలియాలోని డార్విన్‌కు సబ్‌సీ కేబుల్ ద్వారా కనెక్ట్ చేయడానికి పర్యావరణ అనుమతులు కోరింది. దీంతో గూగుల్ తన గ్లోబల్ కనెక్టివిటీని మరింత విస్తరించాలనే ఉద్దేశ్యంతో ఉందని విశ్లేషకులు అంటున్నారు.
ఈ వార్తలపై గూగుల్ స్పందిస్తూ క్రిస్మస్ ఐలాండ్‌లో భారీ AI డేటా సెంటర్ నిర్మిస్తున్నట్టు వచ్చిన సమాచారం అసత్యమని ఖండించింది. తాము కేవలం ఆస్ట్రేలియాతో కనెక్టివిటీని మెరుగుపర్చే సబ్‌సీ కేబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై పని చేస్తున్నామని పేర్కొంది. అయితే రాయిటర్స్ కథనం ప్రకారం ఆ ద్వీపంలో డేటా సైట్ నిర్మాణం జరుగుతోందని స్పష్టంగా వెల్లడించింది.
రిలయన్స్, గూగుల్ వంటి దిగ్గజాలు AI రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో రాబోయే కాలంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సేవలు మరింత విస్తరించనున్నాయి. దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో డేటా సెంటర్లు, సబ్‌సీ కేబుల్ వ్యవస్థలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సాంకేతిక ఆధిపత్యం కోసం జరుగుతున్న పోటీని స్పష్టంగా చూపిస్తున్నాయి.