Railway New Update 2026: రైలు ప్రయాణం అంటేనే ముందుగా గుర్తొచ్చేది టికెట్ కౌంటర్ల దగ్గర ఉండే భారీ క్యూ లైన్లు. జనరల్ టికెట్ తీసుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. కొన్నిసార్లు ఈ రద్దీ వల్ల రైలు మిస్ అయిపోయిన సందర్భాలూ ఎన్నో ఉంటాయి. అయితే, ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు దక్షిణ మధ్య రైల్వే ఒక సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. టెక్నాలజీని సామాన్యుడికి చేరువ చేస్తూ, కేవలం సెకన్ల వ్యవధిలోనే చేతికి టికెట్ వచ్చేలా 'పోర్టబుల్ టికెట్ వెండింగ్ మెషీన్లను' అందుబాటులోకి తెచ్చింది.
హైదరాబాద్ డివిజన్ పరిధిలోని కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఈ పైలట్ ప్రాజెక్టును అధికారులు ఘనంగా ప్రారంభించారు. సాధారణంగా స్టేషన్లలో ఉండే పెద్ద పెద్ద వెండింగ్ మెషీన్లను వాడటం తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కానీ, ఇప్పుడు ప్రవేశపెట్టిన ఈ పోర్టబుల్ మెషీన్లు మొబైల్ ఫోన్ పరిమాణంలో ఉండి, ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. రైల్వే సిబ్బంది (TTE) వీటిని చేతిలో పట్టుకుని స్టేషన్ ఎంట్రీ పాయింట్ల వద్ద, రద్దీగా ఉండే ప్రాంతాల్లో అందుబాటులో ఉంటారు. ప్రయాణికులు వారిని సంప్రదించి తమకు కావాల్సిన టికెట్‌ను వెంటనే పొందవచ్చు.
ఈ మెషీన్ల పనితీరు ఎంతో వేగంగా ఉంటుంది థర్మల్ ప్రింటింగ్ టెక్నాలజీ సహాయంతో సెకనుకు 80 ఎంఎం వేగంతో ఇది టికెట్‌ను ప్రింట్ చేస్తుంది. అంటే మీరు డబ్బులు చెల్లించిన మరుక్షణమే టికెట్ మీ చేతిలో ఉంటుందన్నమాట. కేవలం అన్-రిజర్వ్‌డ్ టికెట్లు మాత్రమే కాకుండా, ప్లాట్‌ఫామ్ టికెట్లు, ఎంఎంటీఎస్ టికెట్లను కూడా దీని ద్వారా జారీ చేస్తారు. దీనివల్ల కౌంటర్ల వద్ద రద్దీ తగ్గడమే కాకుండా, సమయం కూడా భారీగా ఆదా అవుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేలా ఈ మెషీన్లలో డిజిటల్ పేమెంట్ ఆప్షన్లను కూడా చేర్చారు. యూపీఐ (UPI) ద్వారా స్కాన్ చేసి లేదా నగదు ఇచ్చి కూడా టికెట్ తీసుకోవచ్చు. ప్రస్తుతం కాచిగూడ స్టేషన్ మీదుగా రోజుకు సుమారు 55 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇంతటి భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టిన ఈ విధానానికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా అత్యవసరంగా ప్రయాణం చేసేవారికి, స్మార్ట్ ఫోన్ వాడటం రాని వృద్ధులకు ఇది ఎంతో ఊరటనిస్తోంది.
కాచిగూడలో లభించిన స్పందనను బట్టి, అతి త్వరలోనే సికింద్రాబాద్, నాంపల్లి వంటి ప్రధాన స్టేషన్లతో పాటు డివిజన్‌లోని అన్ని చిన్న, పెద్ద స్టేషన్లలో ఈ పోర్టబుల్ మెషీన్లను అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ ప్లాన్ చేస్తోంది. ఈ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, టికెట్ కోసం క్యూలో నిలబడటం అనేది పాత జ్ఞాపకంగా మిగిలిపోనుంది. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.