Telugu States Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఎండ వేడితో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి దిశగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ఏపీ తీరానికి సమీపంలో సముద్ర మట్టానికి సుమారు 3.1 కిలోమీటర్ల ఎత్తులో బలమైన గాలులతో కూడిన ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి తోడు తమిళనాడు నుంచి కర్ణాటక వరకు వ్యాపించి ఉన్న ద్రోణి ప్రభావం వల్ల ఆకాశం మేఘావృతమై ఉంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, దక్షిణ కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాయలసీమ ప్రాంతంలో వాతావరణం మరింత తీవ్రంగా ఉండేలా కనిపిస్తోంది. గురువారం నాడు ఇక్కడ అనేక చోట్ల ఓ మోస్తరు వర్షాలతో పాటు, ఒకటి రెండు చోట్ల వడగళ్ల వాన పడే ప్రమాదం ఉంది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలుల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయే అవకాశం ఉన్నందున ప్రజలు బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. అకాల వర్షాల వల్ల చేతికి వచ్చిన పంట దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇటు తెలంగాణలో కూడా వాతావరణం చల్లబడింది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో రాగల రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. అయితే, ఈ ఉపశమనం తాత్కాలికమేనని, శనివారం నుండి మళ్లీ పొడి వాతావరణం ఏర్పడి ఎండలు ముదురుతాయని అధికారులు స్పష్టం చేశారు.
ముఖ్యంగా పిడుగుల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల వంటి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని, వర్షం పడే సమయంలో పొలాల్లో ఉండేవారు లేదా ప్రయాణాల్లో ఉన్నవారు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని ఆయన కోరారు. సురక్షితమైన భవనాల్లో ఉండటం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని హెచ్చరించారు.