T20 World Cup 2026: యావత్ భారత్ ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం మరో చారిత్రక పోరుకు సిద్ధమైంది. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడి, చరిత్ర సృష్టించాలని సూర్యకుమార్ యాదవ్ సేన పట్టుదలతో ఉంది. అయితే, టీమిండియా ముందున్న అతిపెద్ద సవాల్ 'న్యూజిలాండ్'. ఐసీసీ టోర్నీల్లో కివీస్ అంటేనే భారత్‌కు ఒక అంతుచిక్కని మిస్టరీ. ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్‌ల చరిత్రలో భారత్ ఒక్కసారి కూడా న్యూజిలాండ్‌ను ఓడించలేదు (0-3 రికార్డు). ఈ 'కివీస్ శాపాన్ని' విరగ్గొట్టి ట్రోఫీ గెలవాలంటే, గతంలో చేసిన ఈ మూడు తప్పులను భారత్ అస్సలు పునరావృతం చేయకూడదు.
బ్యాటింగ్ ఆర్డర్‌తో ప్రయోగాలు వద్దు
2021 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ చేసిన అతిపెద్ద తప్పు బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చడం. రోహిత్ శర్మను కాదని ఇషాన్ కిషన్‌ను ఓపెనింగ్‌కు పంపడం జట్టు లయను దెబ్బతీసింది. ప్రస్తుత టోర్నీలో ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ కొంచెం ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, ఫైనల్ లాంటి పెద్ద మ్యాచ్‌లో అనవసరంగా బ్యాటింగ్ క్రమాన్ని మార్చకూడదు. సూర్యకుమార్ తన జట్టుకు ఇచ్చిన "స్వేచ్ఛా మంత్రం" ఫైనల్లోనూ కొనసాగాలి. భయం కనిపిస్తే కివీస్ బౌలర్లు రెచ్చిపోతారని మర్చిపోవద్దు.
స్పిన్ ఉచ్చులో చిక్కుకోకుండా ఉండాలి
న్యూజిలాండ్ జట్టు ఎప్పుడూ స్పిన్నర్లను ఒక ఆయుధంగా వాడుకుంటుంది. మిచెల్ సాంట్నర్, ఈష్ సోధి వంటి బౌలర్లు భారత బ్యాటర్లను కట్టడి చేయడంలో సిద్ధహస్తులు. గతంలో నాగ్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కివీస్ స్పిన్ ధాటికి భారత్ కేవలం 79 పరుగులకే కుప్పకూలింది. సాంట్నర్ బౌలింగ్‌లో కేవలం డిఫెన్స్‌కే పరిమితం కాకుండా, స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఒత్తిడిని తగ్గించుకోవాలి. సూర్యకుమార్, తిలక్ వర్మలు స్పిన్నర్లపై ఎదురుదాడి చేయగలిగితేనే భారీ స్కోరు సాధ్యమవుతుంది.
అహ్మదాబాద్ పాత జ్ఞాపకాలు పక్కన పెట్టాలి
2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఇదే మైదానంలో భారత్ ఓడిపోయింది. అప్పుడు పిచ్‌ను సరిగ్గా అంచనా వేయకపోవడం, మితిమీరిన ఆత్మవిశ్వాసం భారత్‌ను దెబ్బతీశాయి. కివీస్ జట్టు ప్రతి కదలికను ఎంతో ప్లాన్డ్ గా ప్లాన్ చేస్తుంది. సూర్యకుమార్ "నేను కివీస్ మ్యాచ్‌లు పెద్దగా చూడలేదు" అనడం సరదాగా అనిపించినా, క్షేత్రస్థాయిలో మాత్రం ప్రణాళికలు పక్కాగా ఉండాలి. బుమ్రా బౌలింగ్, సంజూ శాంసన్ ఫామ్ భారత్‌కు ప్లస్ పాయింట్లు. వీటిని సరైన రీతిలో వాడుకుంటేనే 'కివీస్ జింక్స్' ముగుస్తుంది. ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న ఈ పోరులో భారత్ తన పాత తప్పుల నుండి పాఠాలు నేర్చుకొని ఆడితే, అహ్మదాబాద్ గడ్డపై మువ్వన్నెల జెండా రెపరెపలాడటం ఖాయం..