అంతరిక్ష పరిశోధనలో ఒక కీలక ముందడుగుగా భావించే ప్రయోగాన్ని అమెరికా శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు. మహిళా వ్యోమగాములు దీర్ఘకాల స్పేస్ మిషన్లలో ఎదుర్కొనే మెన్స్ట్రుయల్ హెల్త్ సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, మెన్స్ట్రుయల్ కప్‌ను అంతరిక్ష పరిస్థితుల్లో ఉపయోగించగలిగే అవకాశంపై జరిపిన తొలి ప్రయోగం సక్సెస్ అయింది. ‘అస్ట్రోకప్ మిషన్’ పేరుతో ఈ ప్రయోగాన్ని కార్నెల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించారు .
ఈ మిషన్‌లో భాగంగా నాలుగు కమర్షియల్ మెన్స్ట్రుయల్ కప్‌లను ప్రత్యేక రాకెట్‌లో ఎక్కించారు. వాటిలో రెండు స్పేస్‌లోకి పంపగా, మరో రెండును భూమిపై నియంత్రిత వాతావరణంలో ఉంచి పోలికలు చేసుకున్నారు. రాకెట్ ప్రయాణంలో ఎదురయ్యే ఉష్ణోగ్రత మార్పులు, ప్రెషర్ వేరియేషన్లు, లాంచ్ సమయంలో వచ్చే భారీ వేగం ఈ అన్నింటినీ తట్టుకుని కప్‌లు ఎటువంటి నష్టం లేకుండా తిరిగి వచ్చినట్టు వివరించారు.
స్పేస్‌లో పరీక్షించిన కప్‌లు లీక్‌ప్రూఫ్‌గా పనిచేశాయని, వాటి నిర్మాణంలో మార్పులు లేకుండా మిగిలి పోయాయని పరిశోధకులు తెలిపారు. నీరు, గ్లిసరిన్ వంటి లిక్విడ్స్ ఉపయోగించి చేసిన లీక్ టెస్టుల్లో కూడా ఒక్క చుక్క కూడ బయటకు రాలేదని నివేదిక తెలిపింది. ఇది మెన్స్ట్రుయల్ కప్‌లు అంతరిక్ష ప్రయాణాల్లో సురక్షితంగా ఉపయోగించవచ్చని స్పష్టమైన మొదటి సాక్ష్యంగా నిలిచింది.
ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన అస్త్రోబయాలజిస్ట్ లిగియా కోహెలో మాట్లాడుతూ, మనుషులు చంద్రుడికి, మంగళగ్రహానికి వెళ్ళే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. అలాంటప్పుడు మహిళల ఆరోగ్యానికి సంబంధించిన అతి చిన్న విషయాన్నీ నిర్లక్ష్యం చేయలేం” అని చెప్పారు. దీర్ఘకాల స్పేస్ మిషన్లలో సాధారణంగా మహిళా వ్యోమగాములు హార్మోనల్ పద్ధతుల్లో పీరియడ్స్‌ను ఆపేస్తారు. కానీ అది ప్రతి మహిళకు సూట్ కాకపోవడంతో ప్రత్యామ్నాయాలు అవసరం ఏర్పడ్డాయన్నారు.
మెన్స్ట్రుయల్ కప్‌లు రీయూజబుల్ కావడం, వ్యర్థాలను తగ్గించడం, డిస్పోజబుల్ పదార్థాల అవసరాన్ని తగ్గించడం వంటి కారణాలతో అంతరిక్షంలో దీర్ఘకాలిక ప్రయాణాలకు అత్యంత అనుకూలమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనిపై జరిగిన మొదటి సైన్స్ స్టడీ కావడంతో ప్రపంచ అంతరిక్ష సంస్థలు ఈ ఫలితాలపై ఆసక్తి చూపుతున్నాయి. ముఖ్యంగా నాసా, ESA వంటి సంస్థలు మహిళా వ్యోమగాముల ఆరోగ్యంపై కొత్త మార్గదర్శకాలు రూపొందించేందుకు ఈ డేటా ఉపయోగపడే అవకాశం ఉంది.
అంతరిక్ష ప్రయాణాల్లో ఇప్పటివరకు ఈ పరికరాల వినియోగంపై ఎటువంటి నిజమైన ప్రయోగాలు లేకపోవడం వల్ల అనేక సందేహాలు ఉన్నాయి. కానీ ఈ ప్రయోగం ఆ సందేహాలను తొలగిస్తూ, మహిళా స్పేస్ ట్రావెలర్స్‌కు మరింత సౌకర్యవంతమైన, ఆరోగ్యపరంగా సురక్షితమైన ఆప్షన్‌ను అందిస్తోంది. మహిళలు స్పేస్ మిషన్లలో మరింత శక్తివంతమైన పాత్ర పోషించే భవిష్యత్తులో ఈ ప్రయోగం ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు.