శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామంలో డయేరియా కేసులు నమోదు కావడం నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడి పరిస్థితిపై సమాచారం తీసుకున్నారు. ఈ ఘటనపై గ్రామంలో ఏం జరుగుతోంది, ఎంతమంది అనారోగ్యానికి గురయ్యారు అనే వివరాలు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీఎంకు అందించారు. శనివారం రాత్రి, ఆదివారం ఉదయం వరకు ఆరుగురు అస్వస్థతకు గురవగా, వారిని వెంటనే టెక్కలి ఆసుపత్రికి తరలించారని చెప్పారు. సోమవారం మరో ముగ్గురిని కూడా ఆసుపత్రిలో చేర్చినట్టు వివరించారు.
అధికారుల ప్రకారం, అనారోగ్యానికి గురైన వారు వేర్వేరు కుటుంబాలకు చెందినవారని తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఐదుగురు చికిత్స పొందుతూ కోలుకుంటుండగా, ముగ్గురు ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించారు. ఇదిలా ఉండగా, చిన్నారావు (70) అనే ఒక వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడని చెప్పారు. ఈ మరణానికి డయేరియా కారణం కాదని, ఆయనకు ముందే కిడ్నీ సంబంధిత సమస్యలు ఉండి, మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ కారణంగా గుండెపోటు వచ్చి మృతి చెందారని వైద్యులు నిర్ధారించిన విషయాన్ని సీఎంకు తెలియజేశారు.
గ్రామంలో ఒక బావి ద్వారా ఐదు పబ్లిక్ ట్యాపులకు నీటి సరఫరా జరుగుతుందని, ఇంకా రెండు చేతి పంపులు కూడా నీటి వనరులుగా ఉన్నాయని అధికారులు వివరించారు. ఈ నీటిని RWS శాఖ పరీక్షించగా ఎక్కడా కలుషితం లేదని, తాగడానికి సురక్షితమని తేలిందని చెప్పారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా బావి నుంచి నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసి, ప్రస్తుతం గ్రామానికి ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నామని తెలిపారు.
గ్రామంలో పారిశుధ్యం, నీటి సరఫరా, పరిశీలన కోసం జిల్లా పంచాయతీ ఆఫీసర్, RWS ఇంజినీర్ అక్కడే శాశ్వతంగా ఉండి పర్యవేక్షణ చేస్తున్నారని అధికారులు తెలిపారు. డిప్యూటీ DMHO, ఎపిడెమియాలజిస్ట్ కూడా గ్రామంలోనే ఉండి డయేరియా ఎలా ప్రబలిందో, ఏ కారణం వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడ్డారో తెలుసుకునేందుకు ఇంటింటికీ వెళ్లి పరిశీలనలు చేస్తున్నారని వివరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, తాళ్లవలస గ్రామ ప్రజలు ఎందుకు అనారోగ్యం పాలవుతున్నారో ఖచ్చితమైన కారణాన్ని కనుగొనాలని ఆదేశించారు. నీటిలో ఎక్కడైనా మలినాలు కలుస్తున్నాయా లేక ఇతర కారణాలా అనే విషయాన్ని శాస్త్రీయంగా పరిశీలించాలని సూచించారు. గ్రామస్థులకు సురక్షితమైన మంచినీరు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు, సమీప గ్రామాలలో కూడా ఇలాంటి పరిస్థితులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టంగా ఆదేశించారు.