తిరుపతి నగరంలో దళిత యువకుడిపై దాడి ఘటన తీవ్ర ఉద్రిక్తతను రేపుతోంది. చిత్తూరు జిల్లా పులిచెర్లకు చెందిన పవన్ కుమార్ అనే యువకుడిని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు కిరాతకంగా దాడి చేశారు. టీవీ5 స్క్రోలింగ్ సమాచారం ప్రకారం, తిరుపతిలోని ఓ గదిలో పవన్‌ను బంధించి, పోలీసులు ఉపయోగించే లాఠీలతో అమానుషంగా కొట్టారు. దాడికి సంబంధించిన వీడియోల్లో కొందరు కొడుతుండగా, మిగతా గ్యాంగ్ సభ్యులు చుట్టూ ఉండి ప్రోత్సహించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. రక్తం రాకుండా కొట్టాలని చెప్పిన మాటలు, బూతులు తిడుతూ హింసించిన ఘటన వీడియోల్లో స్పష్టంగా వినిపిస్తున్నాయి.
ఈ దాడిలో భూమన కుమారుడు అభినయ్ పాత్ర కూడా బయటపడింది. సమాచారం ప్రకారం, దాడి ఆయన ఆఫీస్‌లోనే జరిగిందని, దాడి సమయంలో భూమన మరియు అభినయ్ అక్కడే ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. బాధితుడి తండ్రి నీలం జయరాజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. ఇప్పటికే జగ్గారెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ప్రధాన నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ఈ దాడికి సంబంధించిన వీడియోలు తీసి వాటిని ఇతరులకు పంపినట్లు కూడా తెలుస్తోంది. దీనిపై కూడా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పలు కోణాల్లో దర్యాప్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు శాఖ ప్రకటించింది. భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఈ ఘటనపై బాధిత తండ్రి జయరాజు తీవ్రంగా స్పందించారు. తన కుమారుడి ఆచూకీ తెలియకపోవడంతో కన్నీరు మున్నీరయ్యారు. దాడికి పాల్పడిన గ్యాంగ్ యువకుడిని హింసించి వీడియో తీసి జయరాజుకే పంపించడం బాధాకరమైన విషయం. సామాజికంగా తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారిన ఈ ఘటనపై ప్రజలు, రాజకీయ పార్టీలు పోలీసు శాఖపై ఒత్తిడి తెస్తున్నారు. దళిత యువకుడిపై జరిగిన ఈ అప్రతి సహన చర్యపై న్యాయపరంగా తగిన న్యాయం జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు.