అమెరికాలో కమ్ముకున్న శీతకాల తుపాను కారణంగా అక్కడి సాధారణ జీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. తీవ్రమైన మంచు వర్షాలు, గడ్డకట్టించే చలి, బలమైన గాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల భద్రత దృష్ట్యా 10 రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, అత్యవసర బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆయన వెల్లడించారు.
ఈ తుపాను ప్రభావంతో విమానయాన రంగం తీవ్రంగా దెబ్బతింది. గత మూడు రోజులుగా దేశవ్యాప్తంగా 14 వేలకుపైగా విమానాలు రద్దయ్యాయి. ఫ్లైట్ అవేర్ సంస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం మొత్తం 14,800కి పైగా విమానాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాల్లో సుమారు 43 శాతం రద్దు కాగా, డెల్టా ఎయిర్‌లైన్స్ విమానాల్లో 35 శాతం వరకు ప్రభావం పడింది. ఒక్క శనివారం రోజే నాలుగు వేలకుపైగా విమానాలు రద్దు కావడంతో డల్లాస్, షార్లెట్ వంటి ప్రధాన విమానాశ్రయాల్లో ప్రయాణికులు భారీగా చిక్కుకుపోయారు. సోమవారం కూడా పరిస్థితి పెద్దగా మారలేదు. దాదాపు 1,600కి పైగా విమానాలు రద్దయ్యాయి. న్యూయార్క్, బోస్టన్ ప్రాంతాల్లో ఇంకా తుపాను తీవ్రత కొనసాగుతోంది.
తుపాను మరింత ఉధృతంగా మారడంతో అనేక ప్రాంతాల్లో రహదారులు మంచుతో కప్పుకుపోయాయి. ప్రమాదాలు జరగకుండా అధికారులు పలు జాతీయ రహదారులను పూర్తిగా మూసివేశారు. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర సేవలు మాత్రమే పరిమితంగా కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని టెన్నెస్సీ, జార్జియా, నార్త్ కరోలినా, మేరిల్యాండ్, ఆర్కాన్సాస్, కెంటకీ, లూసియానా, మిసిసిపి, ఇండియానా, వెస్ట్ వర్జీనియా రాష్ట్రాలకు ఎమర్జెన్సీ డిక్లరేషన్లు జారీ చేశారు. ప్రజల భద్రతే ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యం అని అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు.
ఇక జాతీయ వాతావరణ సేవ తూర్పు అమెరికా ప్రాంతాలపై తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని తూర్పు భాగంలో రెండు మూడవ వంతు ప్రాంతాలను ఈ శీతకాల తుపాను కమ్మేస్తుందని అంచనా వేసింది. ఉత్తర, మధ్య మైదానాల నుంచి ఈశాన్య ప్రాంతాల వరకు ఉష్ణోగ్రతలు మైనస్ స్థాయికి పడిపోతాయని పేర్కొంది. గల్ఫ్ కోస్ట్ వరకూ రాత్రివేళ తీవ్రమైన గడ్డకట్టే చలి ఉంటుందని హెచ్చరించింది.
తీవ్ర చలి కారణంగా హైపోథర్మియా, ఫ్రాస్ట్‌బైట్ వంటి ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అవసరమైన ఆహారం, మందులు, హీటింగ్ పరికరాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. దక్షిణ రాష్ట్రాల్లో మంచు పేరుకుపోవడంతో వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ లేకుండా ప్రజలు రోజులు తరబడి చలితో ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది.
దేశవ్యాప్తంగా 17కు పైగా రాష్ట్రాల్లో వింటర్ స్టార్మ్ హెచ్చరికలు అమల్లో ఉన్నాయి. అవసరం లేని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, ప్రభుత్వ సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. వచ్చే వారం వరకూ కూడా తీవ్రమైన చలి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.