అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో తన సాన్నిహిత్యాన్ని ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన రెండో అధ్యక్ష పదవీకాలంలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో చైనాకు వెళ్లే యోచనలో ఉన్నట్లు ఆయన స్పష్టంగా వెల్లడించారు. అదే సమయంలో ఈ ఏడాది చివర్లో షీ జిన్‌పింగ్ అమెరికా పర్యటనకు రానున్నారని కూడా ట్రంప్ తెలిపారు. ఈ రెండు పర్యటనలు అమెరికా–చైనా మధ్య ఉన్న సంబంధాలకు కొత్త ఊపునిస్తాయని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
డావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలకు హాజరై అమెరికాకు తిరిగి వస్తున్న సమయంలో ఎయిర్ ఫోర్స్ వన్‌లో జర్నలిస్టులతో నేను ఏప్రిల్‌లో చైనాకు వెళ్తున్నాను. ఈ ఏడాది ఇద్దరం రెండుసార్లు కలుస్తాం అని మీడియా ద్వారా తెలిపారు . కరోనా కాలంలో రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అంగీకరించిన ట్రంప్, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిందని అన్నారు. అప్పట్లో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, ఇప్పుడు అమెరికా–చైనా సంబంధాలు మెరుగుదల దిశగా సాగుతున్నాయని వ్యాఖ్యానించారు.
షీ జిన్‌పింగ్‌తో తనకు ఎప్పుడూ మంచి వ్యక్తిగత అనుబంధం ఉందని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. షీని ప్రశంసిస్తూ ఆయనను అద్భుతమైన వ్యక్తి గా అభివర్ణించారు. అంతేకాదు, షీ జిన్‌పింగ్ కుటుంబాన్ని కూడా గౌరవంగా ప్రస్తావించడం ద్వారా వ్యక్తిగత దౌత్యానికి తాను ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాడో చూపించారు. ఈ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉన్న విభేదాలను తగ్గించేందుకు ట్రంప్ వ్యక్తిగత సంబంధాలను ఉపయోగించాలనుకుంటున్నారనే సంకేతంగా భావిస్తున్నారు.
వాణిజ్య రంగంలో జరుగుతున్న పరిణామాలను ప్రస్తావించిన ట్రంప్, చైనా ప్రస్తుతం అమెరికా నుంచి పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా సోయాబీన్‌ల కొనుగోళ్లను ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ కొనుగోళ్లు అమెరికా రైతులకు లాభం చేకూరుస్తున్నాయని, రైతులు సంతోషంగా ఉంటే తాను కూడా సంతోషపడతానని ట్రంప్ వ్యాఖ్యానించారు. వ్యవసాయ ఎగుమతుల పెరుగుదల ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవలి కాలంలో అమెరికా–చైనా సంబంధాలు వాణిజ్యం, సాంకేతికత, భద్రత వంటి అంశాలపై తీవ్ర ఉద్రిక్తతలకు లోనయ్యాయి. వరుసగా వచ్చిన అమెరికా ప్రభుత్వాలు చైనాను ప్రధాన గ్లోబల్ సవాలుగా చూస్తూ వచ్చాయి. అయినప్పటికీ వ్యవసాయం, ఇంధన రంగాల్లో రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు ప్రధాన మార్కెట్‌గా కొనసాగుతోంది. చైనా నుంచి భారీ కొనుగోళ్లు జరిగితే, అవి రాజకీయంగా సంబంధాలు మెరుగుపడుతున్నాయన్న సంకేతంగా కూడా పరిగణిస్తుంటారు.
ట్రంప్ తాజా వ్యాఖ్యలు ఆయన రెండో పదవీకాలంలో అమెరికా–చైనా సంబంధాలపై స్పష్టమైన దిశను సూచిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ఏప్రిల్‌లో జరగబోయే చైనా పర్యటన, అలాగే ఈ ఏడాది చివర్లో షీ జిన్‌పింగ్ అమెరికా పర్యటన రెండు దేశాల మధ్య ఉన్న అనిశ్చితిని తగ్గించి, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. అంతర్జాతీయ రాజకీయాల్లో కీలకమైన ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపనున్నాయన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.