- గతంలో జయలలితకు కూడా సలహాదారుగా పనిచేసిన జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివేల్..
- Politics: భారీ విమర్శల నేపథ్యంలో నియామకాన్ని రద్దు చేసిన ప్రభుత్వం..
Vijay: తమిళనాడులో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తొలిరోజే ఒక అనూహ్య నిర్ణయంతో తీవ్ర వివాదంలో చిక్కుకుంది. బుధవారం ఉదయం అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో విజయం సాధించిన వెంటనే, రాధన్ పండిట్ వెట్రివేల్ అనే జ్యోతిష్కుడిని ముఖ్యమంత్రికి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (పొలిటికల్)గా నియమిస్తూ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపింది. అయితే మిత్రపక్షాలు మరియు ప్రతిపక్షాల నుండి ఊహించని స్థాయిలో వ్యతిరేకత రావడంతో, ప్రభుత్వం గత్యంతరం లేక కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఆ వివాదాస్పద నియామకాన్ని వెనక్కి తీసుకోవలసి వచ్చింది.
ఈ నియామకంపై అసెంబ్లీ వేదికగా డీఎండీకే అధినేత్రి ప్రేమలత విజయకాంత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక జ్యోతిష్కుడిని ప్రభుత్వ అత్యున్నత పదవిలో కూర్చోబెట్టడం ద్వారా సమాజానికి, ముఖ్యంగా యువతకు ఎలాంటి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు. వెట్రివేల్ ముఖ్యమంత్రికి వ్యక్తిగత జ్యోతిష్కుడు అయితే ఆ సంబంధాన్ని వ్యక్తిగత స్థాయిలోనే ఉంచుకోవాలని, ప్రభుత్వ వ్యవస్థలోకి తీసుకురావడాన్ని తాము ఖండిస్తున్నామని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం పట్ల ప్రభుత్వానికి వెలుపల నుంచి మద్దతిస్తున్న వీసీకే మరియు కాంగ్రెస్ వంటి కీలక మిత్రపక్షాలు సైతం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి.
ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ వీసీకే ప్రధాన కార్యదర్శి డి. రవికుమార్ మాట్లాడుతూ, లౌకిక ప్రభుత్వంలో ఇటువంటి నియామకాలు ఆమోదయోగ్యం కాదని, ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ సైతం ఒక జ్యోతిష్కుడికి ఓఎస్డీ పదవి ఇవ్వాల్సిన అవసరం ఏముందని సోషల్ మీడియా వేదికగా నిలదీశారు. తొలుత టీవీకే నేత సీటీ నిర్మల్ కుమార్ ఈ నియామకాన్ని సమర్థిస్తూ వెట్రివేల్‌ను మీడియా ప్రతినిధిగా మాత్రమే నియమించామని వివరణ ఇచ్చినప్పటికీ, విమర్శల ధాటికి ప్రభుత్వం చివరకు తలవొంచక తప్పలేదు.
రాధన్ పండిట్ వెట్రివేల్‌కు గతంలోనూ అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. గతంలో ఆయన దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సలహాదారుగా వ్యవహరించారని, అయితే అక్రమాస్తుల కేసులో ఆమెకు అనుకూలంగా ఆయన చెప్పిన జోస్యం విఫలం కావడంతో వారి మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే విజయ్ ప్రభుత్వం ఆయనను నియమించడం చర్చనీయాంశమైంది. విశేషమేమిటంటే, అందరూ ఈ నిర్ణయాన్ని తప్పుబడుతుంటే బీజేపీ మాత్రం విజయ్‌కు అనుకూలంగా స్పందించడం గమనార్హం. మొత్తానికి మిత్రపక్షాల ఒత్తిడికి తలొగ్గి తన తొలి వివాదాస్పద నిర్ణయాన్ని విజయ్ రద్దు చేసుకున్నారు.