బీసీ బిడ్డ కుటుంబానికి ఆర్థికసాయం..
బాధిత కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం..
అమరావతి: కడప జిల్లాలో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రకటించారు.
తొండూరు బీసీ హాస్టల్‌లో ఆరో తరగతి చదువుతున్న గురు ప్రణీత్ కుమార్ (11) వేసవి సెలవుల సందర్భంగా తన అన్నయ్య, తల్లితో కలిసి స్వగ్రామానికి వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. వేంపల్లి మండల కేంద్రానికి చెందిన ఈ బాలుడు వాటర్ బాటిల్ కొనడానికి వెళ్లి తిరిగి వస్తుండగా టిప్పర్ లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పసి వయసులోనే విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది.
ఈ ఘటనపై స్పందించిన మంత్రి సవిత, “బిడ్డను కోల్పోయిన తల్లి పడే బాధను మాటల్లో చెప్పలేం. ఆ కుటుంబం పడుతున్న వేదనను తట్టుకోవడం చాలా కష్టం” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కష్టసమయంలో ప్రభుత్వం వారి పక్కనే ఉందనే భావన కలిగించేందుకు ఈ ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు.
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే బాధిత కుటుంబానికి రూ.2 లక్షల సాయం అందించాలని ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. త్వరలోనే ఈ సాయం కుటుంబానికి అందజేస్తామని తెలిపారు.
విధ్యార్ధి మృతి గ్రామంలోనే కాదు, మొత్తం ప్రాంతంలో విషాదాన్ని నింపింది. విద్య కోసం హాస్టల్‌లో ఉంటున్న బాలుడు ఇలా అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల స్థానికులు కూడా తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయం కొంతైనా ఆ కుటుంబానికి ధైర్యం ఇస్తుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.