గూగుల్ తో భారత్ లోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖకు వచ్చింది..
ఈ రోజు నుంచి విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఓ చరిత్రను సృష్టిస్తోంది..
విశాఖపట్నం: విశాఖలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన అనంతరం ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్ట్‌తో విశాఖపట్నం గ్లోబల్ ఐటీ మ్యాప్‌లో ప్రత్యేక స్థానం సంపాదించనుందని ఆయన తెలిపారు.
భారత్‌లోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా గూగుల్ డేటా సెంటర్ విశాఖకు రావడం గర్వకారణమని లోకేష్ అన్నారు. ఈ ప్రాజెక్ట్ అమలులో అదానీ కనెక్స్, ఎయిర్‌టెల్ నెక్స్ట్రా సంస్థలు అందిస్తున్న సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భూములు ఇచ్చిన రైతులు, ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్న యువతకు ప్రత్యేకంగా నమస్కారం తెలిపారు.
“ఈ రోజు నుంచి విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఒక కొత్త చరిత్రను ప్రారంభిస్తోంది. ఇప్పటి వరకు ఉక్కు నగరంగా పేరున్న విశాఖ ఇకపై ‘డేటా సిటీ’గా మారుతుంది” అని మంత్రి స్పష్టం చేశారు. ఏఐ డేటా సెంటర్‌తో ప్రపంచ స్థాయి టెక్నాలజీ రంగంలో విశాఖ పేరు మారుమోగుతుందని చెప్పారు.
గతంలో సైబరాబాద్‌ను హైటెక్ సిటిగా మార్చిన అనుభవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉందని, అదే దిశలో ఇప్పుడు విశాఖలో కూడా అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. ఆర్సెలార్ మిట్టల్, గూగుల్ వంటి భారీ ప్రాజెక్టులు రాష్ట్రానికి వేగంగా వస్తుండటం ప్రభుత్వంపై పెట్టుబడిదారుల నమ్మకానికి నిదర్శనమని చెప్పారు.
దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ బులెట్ ట్రైన్ సర్కార్ ఉన్నందున ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ సాధ్యమవుతోందని లోకేష్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో దేశంలోకి వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి వస్తున్నాయని తెలిపారు.
ఈ భారీ ప్రాజెక్ట్ ద్వారా రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని చెప్పారు. సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్, మెకానికల్ వంటి విభిన్న రంగాల్లో ఉపాధి అవకాశాలు విస్తరించనున్నాయని వివరించారు.
“మా ప్రభుత్వ లక్ష్యం అభివృద్ధి వికేంద్రీకరణ. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని విధానంతో పాటు క్లస్టర్ ఆధారిత అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాం. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలో వేర్వేరు రంగాల్లో పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం కృషి చేస్తున్నాం” అని మంత్రి చెప్పారు.
కొన్ని వర్గాలు అభివృద్ధికి అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించిన లోకేష్, అయినా కూడా ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌పై నమ్మకం ఉంచి పెట్టుబడులు పెట్టిన గూగుల్, అదానీ, ఎయిర్‌టెల్ సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో విశాఖ ప్రాంతాన్ని తొలి ట్రిలియన్ డాలర్ ఎకనామిక్ రీజియన్‌గా అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ తెలిపారు.