పెట్రోలియం కంపెనీల నుంచి బంకులకు లోడ్ డిస్పాచెస్ ఎలా జరుగుతున్నాయని సీఎం ఆరా..
టెలికాన్ఫరెన్సులో పాల్గొన్న వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు..
విశాఖపట్నం: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
పెట్రోలియం కంపెనీల నుంచి బంకులకు లోడ్ డిస్పాచెస్ ఎలా జరుగుతున్నాయో సీఎం స్వయంగా ఆరా తీశారు. దీనిపై అధికారులు స్పందిస్తూ… రాత్రంతా లోడ్లు పంపిణీ జరిగాయని, నిరంతరం బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా జరుగుతోందని తెలిపారు.
ఇవాళ ఉదయం 6 గంటల నాటికి మొత్తం 1402 లోడ్లు డిస్పాచ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని అధికారులు వివరించారు. అలాగే గత అర్థరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు 2173 కిలోలీటర్ల పెట్రోల్, 2846 కిలోలీటర్ల డీజిల్ అమ్మకాలు జరిగినట్లు తెలిపారు.
స్టాక్ లేని బంకుల సంఖ్యపై కూడా సీఎం వివరాలు తెలుసుకున్నారు. నిన్నటి పరిస్థితులతో పోలిస్తే స్టాక్ సమస్య గణనీయంగా తగ్గిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఉదయం 6 గంటల నాటికి 432 బంకులు మినహా మిగతా అన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
సరఫరా పూర్తిగా సాధారణ స్థితికి వచ్చేంత వరకు నిరంతరం మానిటరింగ్ కొనసాగించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు తగ్గించాలని, అవసరమైతే టోకెన్ లేదా స్లాట్ సిస్టంలను అమలు చేయాలని సూచించారు. ప్రస్తుతం పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుండటంతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.