అమరావతి నడిబొడ్డున అంతర్జాతీయ ఆతిథ్యం.. రాజధానిలో గ్లోబల్ వైబ్స్..
175 గదులు, అత్యున్నత వసతులతో 2028 నాటికి అందుబాటులోకి రానున్న హోటల్..
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా పర్యాటక, పారిశ్రామిక రంగాల్లో కొత్త ప్రాజెక్టులు ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని నడిబొడ్డున అంతర్జాతీయ స్థాయి హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
కృష్ణా నది సమీపంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే ‘కోర్టుయార్డ్ బై మారియట్’ హోటల్‌కు శుక్రవారం ఘనంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, అంతర్జాతీయ బ్రాండ్ అయిన మారియట్ హోటల్ అమరావతిలో ప్రారంభం కావడం శుభపరిణామమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ మేరకు అమరావతిని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే క్రమంలో ఇటువంటి ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
ఈ హోటల్‌ను అత్యున్నత ప్రమాణాలతో నిర్మించనున్నారు. మొత్తం 175 గదులు, విశాలమైన స్విమ్మింగ్ పూల్, బ్యాంకెట్ హాల్, బిజినెస్ లాంజ్, మల్టీ క్యూజీన్ రెస్టారెంట్ వంటి సదుపాయాలు ఇందులో ఉండనున్నాయి. అంతర్జాతీయ పర్యాటకులు, వ్యాపారవేత్తలకు అత్యుత్తమ వసతులు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది.
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం లింగాయపాలెంలో ఏపీ సీఆర్డీయే కార్యాలయం ఎదురుగా ఈ హోటల్ నిర్మాణం చేపడుతున్నారు. సదరన్ గ్లోబ్ హోటల్స్ & రిసార్ట్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ కొనసాగుతోంది. సదరన్ ట్రావెల్స్, గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, డెల్టా ప్యూర్ సంస్థలు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి.
2028 డిసెంబర్ నాటికి ఈ హోటల్ నిర్మాణం పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు. అమరావతి వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ చేపట్టడం తమకు ఆనందంగా ఉందని హోటల్ ప్రతినిధులు తెలిపారు. రాజధాని ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి ఆతిథ్య రంగానికి ఈ హోటల్ ఒక గుర్తింపుగా నిలుస్తుందని, అమరావతికి ‘గ్లోబల్ వైబ్స్’ తీసుకురానుందని స్థానికులు, అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.