పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మద్యం కుంభకోణం కేసులో ఎదురవుతున్న ఇబ్బందులు రోజుకో మలుపు తిప్పుతున్నాయి. తాజాగా ఆయనకు చెందిన గన్‌మెన్ కాలేషా సస్పెండ్ అయ్యాడు. చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ తీసుకున్న ఈ చర్య, పెద్దిరెడ్డి కుటుంబానికి మరో ఎదురుదెబ్బగా మారింది.
జూలై 23న రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న తన కుమారుడు, ఎంపీ మిథున్ రెడ్డిని చూసేందుకు పెద్దిరెడ్డి వెళ్లిన సందర్భంగా, ఆయన వెంట ఉన్న కాలేషా భద్రతా విధులకు బదులుగా వ్యక్తిగత సహాయకుడిలా వ్యవహరించాడు. జైలులోకి వెళ్లేటప్పుడు దుప్పటి, దిండు, భోజనం క్యారియర్ లాంటి వస్తువులు మోస్తూ కనిపించిన కాలేషా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ అంశంపై ఎస్పీ విచారణ చేపట్టగా, కాలేషా నిర్లక్ష్యం చేసినట్టు తేలింది. దీంతో అతడిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గన్‌మెన్‌గా భద్రతా పనుల్లో ఉండాల్సిన వ్యక్తి, పర్సనల్ అసిస్టెంట్‌లా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా ఉండగా, మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు ఇంటి భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరుతూ విజయవాడలోని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈపై విచారణ చేసిన కోర్టు, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అవసరమైన సౌకర్యాలు కల్పించాలని జైలు అధికారులను ఆదేశించింది. ఇంటి భోజనం పంపించేందుకు అండర్‌టేకింగ్ లెటర్ అవసరమని అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డికి ఇంటి భోజనం అందించేందుకు పెద్దిరెడ్డి కుటుంబం రాజమండ్రిలో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నట్లు సమాచారం.