విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి రవి సమీక్ష..
వేసవిలో ప్రతిరోజు 275 నుంచి 285 మిలియన్ యూనిట్ల డిమాండ్..
రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాల దృష్ట్యా విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి రవి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి మూడు డిస్కంల సీఎండీలు, టాన్స్‌కో జేఎండీ హాజరయ్యారు. వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతున్నదని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రోజుకు సుమారు 275 నుంచి 285 మిలియన్ యూనిట్ల వరకు వినియోగం నమోదవుతోందని తెలిపారు.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎక్కడా బ్రేక్‌డౌన్‌లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ కోతలు ఉండకూడదని స్పష్టం చేశారు.
అదేవిధంగా బయట నుంచి విద్యుత్ కొనుగోలు తగ్గించి, రాష్ట్రంలోనే ఉత్పత్తి పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ రంగంలో చేపట్టిన ఆర్డీఎస్ఎస్, సూర్యఘర్, కుసుమ్ వంటి పథకాల అమలును వేగవంతం చేయాలని మంత్రి తెలిపారు.
ఈ పథకాలు సమర్థంగా అమలు కావాలంటే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనులను పర్యవేక్షించాలని సూచించారు. ముఖ్యంగా సూర్యఘర్ పథకం కింద ఆగస్టు నాటికి 6 లక్షల కనెక్షన్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
వేసవి కాలంలో విద్యుత్ సరఫరా సజావుగా కొనసాగడం చాలా ముఖ్యమని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి గొట్టిపాటి రవి స్పష్టం చేశారు.