గూగుల్ క్లౌడ్ హబ్‌తో విశాఖ గ్లోబల్ ఏఐ కేంద్రంగా మారే దిశగా అడుగు..
చంద్రబాబు దూరదృష్టితో గూగుల్ ప్రాజెక్ట్ సాధ్యం..
అమరావతి: విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ దేశ డిజిటల్ రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ ప్రాజెక్ట్ భారత్‌లో ఏఐ రంగానికి స్వర్ణయుగాన్ని తెచ్చిపెడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
మంగళవారం విశాఖలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో మంత్రి ఈ ప్రాజెక్ట్ ప్రాముఖ్యతను వివరించారు. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు.
రూ.87,520 కోట్ల భారీ పెట్టుబడితో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ హబ్ ఏర్పడుతుండటం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి అన్నారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద సింగిల్ కార్పొరేట్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (FDI) ప్రాజెక్ట్ అని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కృషి వల్లే గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థ రాష్ట్రానికి వచ్చిందని కొనియాడారు. గతంలో ఐటీ రంగానికి పునాది వేసిన చంద్రబాబు గారే ఇప్పుడు ఏఐ రంగంలో కూడా రాష్ట్రాన్ని ప్రపంచస్థాయిలో నిలబెడుతున్నారని అన్నారు.
నారా లోకేష్ “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” అనే లక్ష్యంతో విశాఖను గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చాలనే సంకల్పం ఈ ప్రాజెక్ట్‌తో నెరవేరుతుందని మంత్రి తెలిపారు. ఈ డేటా సెంటర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 1,000 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కలిగిన తొలి రాష్ట్రంగా నిలుస్తుందని చెప్పారు.
ఈ ప్రాజెక్ట్ వల్ల ఏఐ రంగంలో ఆవిష్కరణలు వేగవంతం అవుతాయని, విశాఖపట్నం అంతర్జాతీయ స్థాయి టెక్ హబ్‌గా మారుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ “స్వర్ణాంధ్ర @2047” లక్ష్యానికి, కేంద్ర ప్రభుత్వ “ఆత్మనిర్భర్ భారత్” దృష్టికి ఈ ప్రాజెక్ట్ బలాన్నిస్తుంది అని చెప్పారు.
ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే కాకుండా దేశానికి కూడా టెక్నాలజీ రంగంలో కొత్త దిశను చూపించబోతోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.