ఆంధ్రప్రదేశ్‌లో భూముల రీసర్వే ప్రక్రియలో రైతులు, భూస్వాములు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని తహసీల్దార్ స్థాయిలో అభ్యంతరాల పరిష్కార గడువు పొడిగింపు అంశంపై కీలక చర్చ జరిగింది. రాష్ట్ర అసెంబ్లీ పిటిషన్స్ కమిటీ ఛైర్మన్ మరియు డిప్యూటీ స్పీకర్ కె. రఘురామకృష్ణరాజు విశాఖపట్నం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం ఉన్న ఏడాది గడువును రెండేళ్లకు పొడిగించాలని అధికారికంగా సిఫార్సు చేస్తామన్నారు. ఈ నిర్ణయం వల్ల రైతులకు అదనపు సమయం లభించి, వారి భూములకు సంబంధించిన అభ్యంతరాలు సక్రమంగా పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని రఘురామ స్పష్టం చేశారు.
రీసర్వే ప్రస్తుత ప్రగతిపై అధికారులు వివరణ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 వేల గ్రామాలలో ఇప్పటివరకు 6,688 గ్రామాల్లో సర్వే పూర్తయిందని తెలిపారు. ఈ ప్రక్రియలో భారీ ఎత్తున ఫిర్యాదులు, అభ్యంతరాలు వచ్చాయి. ఇప్పటివరకు 7 లక్షలకుపైగా అభ్యంతరాలు నమోదయ్యాయి. వాటిలో 3 లక్షల వరకు జాయింట్ ఎల్‌పీఎం (ల్యాండ్ పార్సిల్ మేనేజ్‌మెంట్) సమస్యలకు సంబంధించినవని సర్వే అండ్ సెటిల్‌మెంట్ డైరెక్టర్ ఆర్. కూర్మనాథ్ తెలిపారు. వీటిలో రెండు లక్షల సమస్యలు ఇప్పటికే పరిష్కరించామని, మిగిలిన వాటిని త్వరితగతిన తీర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు.
రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ, రీసర్వేలో వెలువడుతున్న అనేక సమస్యలు నిర్ణీత ఏడాది వ్యవధిలో పరిష్కరించడానికి కష్టమవుతుందని అన్నారు. రైతులు తమ సమస్యలను కోర్టుల వరకు తీసుకెళ్లకుండా, ప్రభుత్వ వ్యవస్థలోనే సులభంగా పరిష్కారం పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గడువు రెండేళ్లకు పెరిగితే, సర్వేలో కన్పిస్తున్న సాంకేతిక లోపాలు, సరిహద్దుల సమస్యలు, పొలాల పరిమాణాల్లో తేడాలు వంటి అంశాలను సమగ్రంగా చూసి సరిదిద్దుకోవడానికి రైతులకు తగిన అవకాశం ఉంటుందని అన్నారు. ఈ సిఫార్సుపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో కమిటీ సభ్యులు, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, కొణతాల రామకృష్ణ, పి. విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. రీసర్వే ప్రక్రియ రాష్ట్రానికి అత్యంత కీలకం కావడంతో, రైతులు ఎదుర్కొంటున్న ప్రతీ సమస్యను సీరియస్‌గా పరిశీలించాలి అని సభ్యులు అభిప్రాయపడ్డారు. గడువు పొడిగింపు రైతులకు భారీగా ఉపశమనం కలిగించగలదని, వారి భూములపై స్పష్టమైన, వివాదరహిత రికార్డులు లభించడానికి ఇది ఉపయోగపడుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ సిఫార్సులపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుందన్న ఆసక్తి పెరుగుతోంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ ఇవ్వవచ్చని సూచనలు వినిపిస్తున్నాయి.