- ప్రకాశం జిల్లా టంగుటూరులో లారీ ఓనర్స్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్న మంత్రి డా.స్వామి..
- జిల్లాలో ఏర్పాటు కానున్న పరిశ్రమల ద్వారా..
AP Politics Veeranjaneyaswamy: అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సూచించారు. టంగుటూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా లారీ యజమానులు, పొగాకు కంపెనీ యజమానులు, కలప వ్యాపారులతో టంగుటూరులోని ఓ ఫంక్షన్ హాల్ లో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మంత్రి స్వామి ప్రసంగించారు. లారీ ఓనర్లు న్యాయబద్ధంగా కస్టమర్లకు ఇబ్బందులు లేకుండా రవాణా సాగించాలన్నారు. జిల్లా అంతట రవాణా ధరలు ఒకే విధంగా ఉండేలా చూడాలని చెప్పారు. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ లారీ ఓనర్స్ అసోసియేషన్ కు గ్రీన్ టాక్స్ తగ్గింపు చేస్తామని ఇచ్చిన హామీనీ నెరవేర్చామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గుంతల రోడ్లను మరమ్మత్తులు చేసి వాహనాలు దెబ్బ తినకుండా పరోక్షంగా చర్యలు చేపట్టామని అన్నారు.
జిల్లాలో ఏర్పాటు కానున్న పరిశ్రమల ద్వారా అసోసియేషన్ కు రవాణా రంగం ద్వారా లాభాలు పొందడానికి అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో రహదారులపై రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు బ్లాక్ స్పాట్లను ప్రతి జిల్లాలో గుర్తించామన్నారు. రహదారుల్లో రక్షణ చర్యలు చేపట్టేందుకు ప్రతి జిల్లాకు రూ.కోటి నిధులను ముఖ్యమంత్రి ఇవ్వనున్నట్లు తెలిపారు. టంగుటూరు టోల్ పన్ను రాయితీపై అసోసియేషన్ నిర్వాహకులు అర్జీ సమర్పించాలని, విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపిస్తామని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం బ్యాటరీ వాహనాలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తుందని. బ్యాటరీ వాహనాలపై రాయితీ కల్పిస్తున్నట్లు, దీనిని లారీ ఓనర్స్ అసోసియేషన్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిగురుపాటి గిరి, ఒంగోలు, కందుకూరు, టంగుటూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కల్లూరి అంజిబాబు, కంచర్ల మాధవరావు, కొత్త నాగేశ్వరరావు, సూధనగుంట శ్రీనివాసరావు, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.