జొమాటో, బ్లింకిట్ వంటి క్విక్ కామర్స్ సంస్థలు అందిస్తున్న 10 నిమిషాల డెలివరీ వెనుక అసలు రహస్యాన్ని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ వెల్లడించారు. ఈ వేగవంతమైన డెలివరీకి డెలివరీ పార్ట్‌నర్లు అతివేగంగా వాహనాలు నడపడం కారణం కాదని ఆయన స్పష్టం చేశారు. వినియోగదారుల ఇళ్లకు అతి సమీపంలోనే దట్టంగా ఏర్పాటు చేసిన ‘డార్క్ స్టోర్ల’ నెట్‌వర్క్ వల్లే ఇంత తక్కువ సమయంలో డెలివరీ సాధ్యమవుతోందని చెప్పారు. డెలివరీ ఏజెంట్ల భద్రతపై వస్తున్న విమర్శలు, న్యూ ఇయర్ సందర్భంగా కొందరు గిగ్ వర్కర్లు చేసిన నిరసనల నేపథ్యంలో ‘X’ (ట్విట్టర్) వేదికగా ఆయన ఈ అంశాలపై స్పందించారు.
డెలివరీ ప్రక్రియ ఎలా జరుగుతుందో గోయల్ వివరించారు. ఒక ఆర్డర్ వచ్చిన తర్వాత స్టోర్‌లో ప్యాకింగ్‌కు సగటున 2.5 నిమిషాల సమయం మాత్రమే పడుతుందని చెప్పారు. డెలివరీ దూరం సాధారణంగా 2 కిలోమీటర్ల లోపే ఉంటుందని, గంటకు కేవలం 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా సుమారు 8 నిమిషాల్లో కస్టమర్‌కు చేరుకోవచ్చని వివరించారు. అంటే వేగంగా వాహనం నడపాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశారు. ఆలస్యంగా డెలివరీ చేస్తే డెలివరీ పార్ట్‌నర్లపై ఎలాంటి జరిమానాలు విధించమని, అలాగే సమయానికి డెలివరీ చేసినందుకు ప్రత్యేక బోనస్‌లు లేదా ఇన్సెంటివ్‌లు కూడా ఉండవని ఆయన తేల్చిచెప్పారు. దీనివల్ల డెలివరీ పార్ట్‌నర్లపై అదనపు ఒత్తిడి ఉండదన్నారు.
డెలివరీ ఏజెంట్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలపై కూడా గోయల్ స్పందించారు. ఇది కేవలం డెలివరీ పార్ట్‌నర్ల సమస్య మాత్రమే కాదని, సమాజంలోనే చాలామందికి తొందర ఎక్కువగా ఉంటుందని వ్యాఖ్యానించారు. అయితే, డెలివరీ పార్ట్‌నర్లు యూనిఫాంలో ఉండటం వల్ల వారు సులభంగా కనిపిస్తారని, అందుకే విమర్శలు ఎక్కువగా వారి మీద పడుతున్నాయని చెప్పారు. రోడ్డు భద్రత తమకు అత్యంత ముఖ్యమని, ట్రాఫిక్ నియమాలు పాటించేలా డెలివరీ పార్ట్‌నర్లకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
ఇక, నిరసనల నడుమ కూడా జొమాటో, బ్లింకిట్ కార్యకలాపాలు ఆగలేదని గోయల్ వెల్లడించారు. న్యూ ఇయర్ రోజున జొమాటో, బ్లింకిట్ కలిసి రికార్డు స్థాయిలో సుమారు 75 లక్షల ఆర్డర్లను విజయవంతంగా డెలివరీ చేసినట్లు తెలిపారు. ఇది క్విక్ కామర్స్ రంగంలో పెరుగుతున్న డిమాండ్‌కు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. వినియోగదారుల సౌకర్యం, డెలివరీ పార్ట్‌నర్ల భద్రత – ఈ రెండింటికీ సమతుల్యతతో ముందుకెళ్లడమే తమ లక్ష్యమని గోయల్ స్పష్టం చేశారు.