ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మౌలిక వసతుల (Infrastructure) అభివృద్ధిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల మధ్య అనుసంధానాన్ని పెంచేందుకు రెండు కొత్త జాతీయ రహదారుల (National Highways) నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఈ రహదారుల నిర్మాణం ఈ ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి, రవాణా సౌకర్యాల మెరుగుదలకు దోహదపడనుంది.
రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలని కోరుతున్న ఈ రెండు మార్గాలు చాలా వ్యూహాత్మకమైనవి.. గుంటూరు నుంచి ప్రత్తిపాడు, పర్చూరు, ఇంకొల్లు మీదుగా నాగులుప్పలపాడు వరకు ఈ హైవేను ప్రతిపాదించారు.
ఈ రోడ్డు పొడవు 89 కిలోమీటర్లు. ఈ మార్గంలో బైపాస్‌లు కూడా నిర్మించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ. 1,183.21 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
గుంటూరు నుంచి నారాకోడూరు మీదుగా బాపట్ల వరకు ఈ మార్గాన్ని ప్రతిపాదించారు. ఈ రోడ్డు పొడవు 45 కిలోమీటర్లు. ఈ కొత్తగా ప్రతిపాదించబడుతున్న రెండు హైవేలు రాష్ట్రంలోని మరో రెండు ముఖ్యమైన జాతీయ రహదారులతో కలుస్తాయి.
ఈ రెండు కొత్త హైవేలు కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిని (NH-16) మరియు వాడరేవు-చిలకలూరిపేట జాతీయ రహదారిని (NH-216) కలుపుతాయి. గుంటూరు - బాపట్ల మార్గం గుంటూరులోని బైపాస్ వద్ద ప్రారంభమై, బాపట్ల వద్ద జాతీయ రహదారి 216 తో కలుస్తుంది.
ప్రస్తుతం ఉన్న రాష్ట్ర రహదారిని నాలుగు వరుసల జాతీయ రహదారిగా అభివృద్ధి చేయడం ద్వారా నారాకోడూరు, చేబ్రోలు, పొన్నూరు, అప్పికట్ల వంటి ప్రాంతాలు గుంటూరు మరియు బాపట్ల నగరాలతో మరింత సులభంగా కనెక్ట్ అవుతాయి. ఈ రెండు మార్గాలు కేవలం రోడ్లు మాత్రమే కాదు, గుంటూరు, బాపట్ల జిల్లాల వ్యవసాయ, వాణిజ్య ఆర్థిక వ్యవస్థకు జీవనాడి వంటివి.
ఈ రూట్లలో భారీ వాహనాలు, రవాణా వాహనాలు అధికంగా రాకపోకలు సాగిస్తున్నాయి. బాపట్ల, గుంటూరు జిల్లాల నుంచి పండే ఆక్వా, ఉద్యాన పంటలు, శనగ, పత్తి, మిర్చి వంటి కీలకమైన వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఈ మార్గాలు అత్యంత కీలకం.
ఈ హైవేలు పూర్తి అయితే ప్రయాణ సమయం తగ్గి, రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా, గ్రామీణ ప్రాంతాలు మరియు కొన్ని పట్టణాలకు అనుసంధానం కావడం వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు.
దీంతో పాటు, ఒంగోలు-కత్తిపూడి జాతీయ రహదారిని కూడా నాలుగు లేదా ఆరు లైన్లుగా విస్తరించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆ ప్రాజెక్టుకు ప్రస్తుతం డీపీఆర్ (DPR - Detailed Project Report) తయారు చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. ఈ విస్తరణతో కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి 16 మరియు కత్తిపూడి-ఒంగోలు జాతీయ రహదారుల మధ్య అనుసంధానం మరింత పెరుగుతుంది.