- Politics: అసెంబ్లీకి రాకుండా వైసీపీ ముఖం చాటేసింది: 11 మంది ఎమ్మెల్యేల చిత్తశుద్ధి ఇదేనా?
- ఏప్రిల్ 1న కేంద్ర కేబినెట్ భేటీ.. అమరావతి బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఖాయమన్న లోకేశ్..
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే చారిత్రాత్మక తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న వేళ, ప్రతిపక్ష వైసీపీ సభ్యుల గైర్హాజరుపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఇంతటి కీలక ఘట్టంలో కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ సభకు రాకుండా తప్పించుకోవడం ఆ పార్టీకి రాజధానిపై ఉన్న చిత్తశుద్ధిని వెల్లడిస్తోందని విమర్శించారు. వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఏమిటో, ఆయన జ్ఞానం ఎంతో అందరికీ తెలుసని ఎద్దేవా చేస్తూ, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు సభలో ఉండాల్సింది పోయి బయట విమర్శలు చేయడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు హర్షిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
ఇటీవల పాదయాత్ర చేస్తూ చంద్రబాబు నాయుడుకు 'సినిమా చూపిస్తా' అని జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై లోకేశ్ తనదైన శైలిలో చమత్కరించారు. గత ఎన్నికల్లో ప్రజలు జగన్‌కు కేవలం 11 సీట్లు ఇచ్చి చూపించిన 'బ్లాక్‌బస్టర్ సినిమా' ఇంకా ఆయనకు సరిపోయినట్లు లేదని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు జగన్ చూపిస్తానంటున్న కొత్త సినిమా బాక్సాఫీస్ వద్ద 11 రోజులు కూడా ఆడదని, గత ఐదేళ్ల 'తుగ్లక్' పాలనను చూసిన ప్రజలు మళ్లీ అటువంటి ప్రయోగాలకు సిద్ధంగా లేరని ఘాటుగా స్పందించారు. అసెంబ్లీ సాక్షిగా అమరావతికి లభించిన ఈ చట్టబద్ధత ఏపీ పునర్నిర్మాణంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని, దీనిని అడ్డుకోవాలని చూసే వారికి కాలం చెల్లిందని ధ్వజమెత్తారు.
అమరావతి తీర్మానం తదుపరి ప్రక్రియపై లోకేశ్ కీలక వివరాలను వెల్లడించారు. అసెంబ్లీ ఆమోదించిన ఈ తీర్మానం శనివారం రాత్రికే నేరుగా ఢిల్లీకి చేరుకుంటుందని, ఏప్రిల్ 1న జరగనున్న కేంద్ర కేబినెట్ భేటీలో ఈ బిల్లుకు ఆమోదం లభించే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం ఏప్రిల్ 2న ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఇక్కడ అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేసిన వైసీపీ నేతలు, కనీసం ఏప్రిల్ 2న పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడైనా తమ వైఖరిని స్పష్టం చేస్తారా అని ఆయన సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యమనుకునే వారికి పార్లమెంట్ వేదికగా తగిన సమాధానం లభిస్తుందని లోకేశ్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.