తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక శుభవార్త అందించింది. సంక్రాంతి పండుగ కానుకగా లబ్దిదారులకు నేరుగా ఉపయోగపడేలా నిధుల విడుదల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇకపై ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతి ఎంత వేగంగా సాగితే, అదే వేగంతో లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి ఆలస్యం జరగకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ కీలక నిర్ణయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా ప్రకటించారు.
రామగుండంలో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక ప్రకటన చేశారు. ఇళ్ల నిర్మాణం దశలవారీగా పూర్తవుతున్న కొద్దీ, ప్రతీవారం లబ్దిదారుల అకౌంట్లలో నిధులు విడుదల చేసే విధానాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం సహించేది లేదని, అధికారులు మరింత బాధ్యతతో పనిచేయాలని హెచ్చరించారు. ఈ నిర్ణయంతో లబ్దిదారులకు ఆర్థిక భరోసా పెరుగుతుందని ఆయన తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇప్పటివరకు ఈ పథకం కింద రూ.22,500 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. త్వరలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు కూడా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇకపై గ్రామీణ ప్రాంతాలకే కాకుండా పట్టణ ప్రాంతాల్లో నివసించే పేదలకు కూడా ఇళ్ల కేటాయింపులు జరగనున్నాయని స్పష్టం చేశారు. పేదలకు సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అదే సమయంలో రామగుండం ప్రాంత అభివృద్ధిపై కూడా డిప్యూటీ సీఎం కీలక ప్రకటన చేశారు. రామగుండంలో త్వరలోనే 800 మెగావాట్ల సామర్థ్యంతో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని చెప్పారు. ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం లేదని, దానిని మరింత బలోపేతం చేసే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే సింగరేణి కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమా అమలు చేస్తున్నామని, కేవలం బొగ్గుకు మాత్రమే కాకుండా సింగరేణిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి పాత్ర అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.