కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (Nuclear Power Corporation of India Limited – NPCIL) శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న తన యూనిట్లలో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు NPCIL తాజాగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 114 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా ఇంటర్ అర్హతతో పాటు ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారికి ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. కొన్ని పోస్టులకు నెలకు రూ.55,932 వరకు జీతం ఉండటం విశేషం.
ఈ నోటిఫికేషన్‌లో (NPCIL Recruitment 2026) సాంకేతిక, నాన్-సాంకేతిక విభాగాలకు చెందిన పలు కీలక పోస్టులు ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్/బీ (సివిల్) పోస్టులు 2 ఉండగా, అత్యధికంగా స్టైపెండరీ ట్రైనీ/టెక్నీషియన్ పోస్టులు 95 ఉన్నాయి. వీటితో పాటు ఎక్స్-రే టెక్నీషియన్ పోస్టులు 2, అసిస్టెంట్ గ్రేడ్-1 పోస్టులు 15 ఉన్నాయి. NPCILలో పని చేయాలనుకునే యువతకు ఇది ఒక స్థిరమైన, భవిష్యత్తు ఉన్న ఉద్యోగ అవకాశంగా భావించవచ్చు.
ఈ ఉద్యోగాలు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, హెల్త్ ఫిజిక్స్ వంటి విభాగాల్లో ఉన్నాయి. అలాగే ప్లాంట్ ఆపరేటర్, మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ వంటి ట్రేడ్ పోస్టులు కూడా ఉన్నాయి. అభ్యర్థులు తాము చదివిన కోర్సు, ట్రేడ్‌కు అనుగుణంగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హత విషయానికి వస్తే, సంబంధిత పోస్టును బట్టి ఇంటర్‌మీడియట్, ఐటీఐ, డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కొన్ని ప్రత్యేక పోస్టులకు పని అనుభవం కూడా అవసరం ఉంటుంది. పూర్తి అర్హతలు, విభాగాల వారీ వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.
వయోపరిమితి 2026 ఫిబ్రవరి 4 నాటికి కనీసం 18 ఏళ్లు, గరిష్టంగా 30 ఏళ్లు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 2026 జనవరి 15 నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 4 వరకు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు NPCIL అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.150 ఫీజు ఉండగా, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం రాత పరీక్ష, పోస్టును బట్టి స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. తుది మెరిట్ లిస్ట్ (Stipendiary Trainee Jobs) ఆధారంగా నియామకాలు చేపడతారు. జీతభత్యాల విషయానికి వస్తే, సైంటిఫిక్ అసిస్టెంట్‌కు (Scientific Assistant Jobs)నెలకు రూ.55,932, స్టైపెండరీ ట్రైనీ/టెక్నీషియన్‌కు రూ.34,286, ఎక్స్-రే టెక్నీషియన్ మరియు అసిస్టెంట్ గ్రేడ్-1కు రూ.40,290 జీతం ఉంటుంది. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఇతర అలవెన్సులు, సౌకర్యాలు కూడా లభిస్తాయి.
కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, అర్హతలు, పరీక్ష విధానం, ముఖ్యమైన తేదీలను జాగ్రత్తగా పరిశీలించుకోవడం మంచిదని సూచిస్తున్నారు