TVKకు మద్దతు ఇస్తునట్టు ఎమ్మెల్యే కామరాజ్ ప్రకటన..
తమిళనాడు అసెంబ్లీలో విజయ్ బలపరీక్ష ప్రారంభం..
తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు TTV దినకరన్ నేతృత్వంలోని AMMK పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకోగా, మరోవైపు తమిళనాడు అసెంబ్లీలో విజయ్ బలపరీక్ష రాజకీయ వేడిని పెంచింది.
AMMK పార్టీకి చెందిన ఎమ్మెల్యే కామరాజ్ అనూహ్యంగా TVK పార్టీకి మద్దతు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. “విజయ్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు గెలిపించారు. ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ నేను TVKకు మద్దతు ఇస్తున్నాను” అని కామరాజ్ స్పష్టం చేశారు. ఆయన ప్రకటనతో AMMKలో కలకలం రేగింది.
దీనిపై వెంటనే స్పందించిన TTV దినకరన్, పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ కామరాజ్‌ను AMMK నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయనే చర్చ సాగుతోంది.
ఇక తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం కీలకంగా మారింది. ఈ బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. మరోవైపు AIADMKలో విభేదాలు బయటపడుతున్నాయి. విజయ్‌కు మద్దతు ఇవ్వవద్దని ఎడప్పాడి పళనిస్వామి తన పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసినప్పటికీ, AIADMKలోని షణ్ముగం వర్గం మాత్రం విజయ్‌కు మద్దతుగా నిలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
అసెంబ్లీలో జరుగుతున్న ఈ బలపరీక్ష తమిళనాడు రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విజయ్‌కు మద్దతుగా కొన్ని వర్గాలు నిలుస్తుండగా, ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారాయి.