- Cinema: ఓటీటీ, షార్ట్ ఫార్మ్ కంటెంట్ ప్రేక్షకులకు పెద్ద సవాల్ అన్న పూజ..
- సినిమా ఎలా ఉంటుందో కొన్ని నిమిషాల్లోనే ప్రేక్షకులు జడ్జ్ చేస్తారని వ్యాఖ్య..
Pooja Hegde: స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే థియేట్రికల్ సినిమాల ప్రస్తుత పరిస్థితిపై చేసిన కొన్ని ముక్కుసూటి వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూజ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో ప్రేక్షకులు ఎంతగానో అప్‌డేట్ అయ్యారని, సినిమా ఎంపికలో ఎంతో నిశితంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. థియేటర్లలో సినిమా చూసేటప్పుడు అది నిజంగా ఎంటర్‌టైన్ చేస్తుందా లేదా అనేది మొదటి కొన్ని నిమిషాల్లోనే ప్రేక్షకులు జడ్జ్ చేయగలరని అభిప్రాయపడిన ఆమె, ఇకపై మనం నకిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను మోసం చేయలేమని స్పష్టం చేశారు. థియేటర్లలో ఏ సినిమా చూడాలో ఎంచుకునే విషయంలో వారు చాలా జాగ్రత్తగా ఉంటున్నారని, ఒక సినిమా వారి హృదయానికి కనెక్ట్ అవుతుందా లేదా అనేది ప్రేక్షకులు చాలా త్వరగా గ్రహిస్తున్నారని ఆమె విశ్లేషించారు.
కమర్షియల్ సినిమాల్లో నటించేటప్పుడు గ్లామర్, ఎమోషన్, కామెడీ, డ్యాన్స్, నటన వంటి అన్నింటినీ ఒకేసారి పర్ఫెక్ట్‌గా డెలివరీ చేయడం నటీనటులకు ఒక పెద్ద సవాల్ అని పూజా హెగ్డే పేర్కొన్నారు. దీనికి తోడు ఓటీటీ, రీల్స్ వంటి షార్ట్-ఫార్మ్ కంటెంట్ నుండి వస్తున్న గట్టి పోటీ కారణంగా థియేట్రికల్ రిలీజ్ అనేది మేకర్స్‌కు ఒక నిజమైన పరీక్షగా మారిందని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే ఈ సవాళ్లు ఎన్ని ఉన్నప్పటికీ, బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్‌పై పూజ పూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. థియేటర్లలో అందరితో కలిసి నవ్వుతూ, చప్పట్లు కొడుతూ, డ్యాన్స్ చేస్తూ సినిమా చూడటంలో ఉండే ఆనందమే వేరని, ఆ సామూహిక అనుభూతిని ఓటీటీలో ఒంటరిగా చూస్తూ ఎప్పటికీ పొందలేమని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ పరిశ్రమల్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న పూజా హెగ్డే, త్వరలోనే వరుణ్ ధావన్ సరసన నటించిన 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' అనే హిందీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.