కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహ మార్గాల పరిశీలన..
వాగుల ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు..
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో మౌలిక సదుపాయాల నిర్మాణ పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహ మార్గాలతో పాటు పెనుమాక రిజర్వాయర్‌ను సందర్శించి పరిస్థితులను అధికారులతో కలిసి సమీక్షించారు.
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో వాగుల సహజ ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో జరుగుతున్న రహదారుల నిర్మాణ పనుల కారణంగా నీటి ప్రవాహం ఎక్కడా అడ్డంకులు ఎదుర్కోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
నిర్మాణంలో ఉన్న వంతెనల వద్ద పరిస్థితులను పరిశీలించిన మంత్రి, వంతెనల క్రింది భాగంలో పేరుకుపోయిన మట్టి, పూడికను తొలగించే పనులను వేగవంతం చేయాలని చెప్పారు. వర్షపు నీరు సాఫీగా ప్రవహించేలా పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
రాజధాని నిర్మాణ పనులతో పాటు వరద నివారణ చర్యలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, భవిష్యత్తులో నీటి నిల్వలు లేదా వరద సమస్యలు తలెత్తకుండా సమగ్ర ప్రణాళికతో పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.
రాజధాని అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో మౌలిక వసతుల నిర్మాణంతో పాటు పర్యావరణ, జలవనరుల పరిరక్షణకు కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని మంత్రి తెలిపారు.