జేఈఈ, నీట్ వంటి ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 విద్యా సంవత్సరం నుంచి ఎన్టీయే నిర్వహించే పరీక్షలన్నింటికీ ఫేషియల్ రికగ్నిషన్ వెరిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థి స్థానంలో మరొకరు పరీక్ష రాయడం, నకిలీ గుర్తింపుతో హాజరు కావడం వంటి అక్రమాలను పూర్తిగా నివారించడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యం. జాతీయ స్థాయిలో తీవ్ర పోటీ ఉండే ఈ పరీక్షల్లో పారదర్శకత, విశ్వసనీయత పెంచేందుకు ఈ కొత్త విధానం కీలకంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ కొత్త విధానంలో భాగంగా పరీక్షలకు దరఖాస్తు చేసుకునే దశ నుంచే అభ్యర్థుల లైవ్ ఫొటోలను క్యాప్చర్ చేసే ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. వెబ్‌క్యామ్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా రియల్ టైంలో ఫొటోలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫొటోలను పరీక్షా కేంద్రాల్లో తీసే ఫొటోలతో పోల్చి నిర్ధారించడం ద్వారా వ్యక్తి గుర్తింపులో ఎలాంటి అనుమానాలకు అవకాశం లేకుండా చేస్తారు. ఈ విధానం అమల్లోకి వస్తే ఒకరికి బదులుగా మరొకరు పరీక్ష రాసే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని ఎన్టీయే అంచనా వేస్తోంది.
ఇప్పటికే ఆధార్ ఆధారిత ఫేస్ అథంటికేషన్‌ను ఎన్టీయే గతేడాది నీట్ యూజీ పరీక్షల సమయంలో ఢిల్లీలోని కొన్ని ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేసింది. ఈ ప్రయోగం సానుకూల ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో, 2026 నుంచి దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పరీక్షా కేంద్రాల్లో దీన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని యోచిస్తోంది. అభ్యర్థుల ఆధార్ డేటాతో ఫేస్ రికగ్నిషన్ సరిపోల్చడం ద్వారా పరీక్షల భద్రత మరింత బలపడనుందని అధికారులు చెబుతున్నారు.
ఇదే సమయంలో ఎన్టీయే అభ్యర్థులకు కొన్ని కీలక సూచనలు కూడా జారీ చేసింది. సెప్టెంబర్‌లో విడుదల చేసిన పబ్లిక్ నోటీసులో, JEE (మెయిన్) 2026 అభ్యర్థులు తమ ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, తాజా ఫొటో, చిరునామా, తండ్రి పేరు వంటి వివరాలు తప్పుల్లేకుండా అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. అక్టోబర్‌లో మరో నోటీసులో UIDAI ద్వారా ఆధార్ ప్రామాణీకరణ చేసి అభ్యర్థుల వివరాలను పొందనున్నట్లు తెలిపింది. గత ఏడాది ఇస్రో మాజీ చైర్మన్ కె. రాధాకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ కూడా పరీక్షల సమగ్రత కోసం బయోమెట్రిక్ ప్రామాణీకరణతో పాటు మరిన్ని భద్రతా చర్యలను సిఫార్సు చేసింది. ఈ సిఫార్సుల అమలుతో జేఈఈ, నీట్ వంటి కీలక పరీక్షలు మరింత పారదర్శకంగా మారనున్నాయి.