బిహార్ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ప్రచార సభల్లో జాతీయ నాయకులు పదునైన వ్యాఖ్యలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ సీతామఢీలో జరిగిన ఎన్నికల సభలో ఘాటైన ప్రసంగం చేశారు. ఆయన తన ప్రసంగంలో బిహార్ ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు – “మీకు గన్స్ కావాలా? లేక ల్యాప్టాప్స్ కావాలా?” అంటూ ఆర్జేడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
మోదీ మాట్లాడుతూ, “ఎన్డీఏ ప్రభుత్వం యువతకు ల్యాప్టాప్స్, ఫుట్‌బాల్‌లు, హాకీ స్టిక్స్ అందిస్తోంది. వాళ్లకు విద్య, క్రీడలు, అభివృద్ధి ముఖ్యం. కానీ ఆర్జేడీ నాయకులు మాత్రం తుపాకులు ఇవ్వడం గురించి మాట్లాడుతున్నారు. ఇది నేటి యువత ఆలోచన కాదు, ఇది వెనుకబడిన రాజకీయాల సంకేతం” అని అన్నారు.
అలాగే ఆయన “బిహార్ ప్రజలు జంగిల్ రాజ్ రోజులను మళ్లీ చూడాలనుకోవడం లేదు. ఆ రోజుల్లో రాష్ట్రం భయంతో వణికిపోయింది. పరిశ్రమలు మూతబడ్డాయి, ఉద్యోగాలు పోయాయి, అభివృద్ధి నిలిచిపోయింది. కాని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిహార్ అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తోంది. ఇప్పుడు పెద్ద పెద్ద రోడ్లు, విద్యాసంస్థలు, హాస్పిటల్స్ నిర్మాణం జరుగుతోంది” అని గుర్తు చేశారు.
ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఆరోగ్యరంగం, విద్యా రంగం, పారిశ్రామిక రంగం అభివృద్ధిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. “జంగిల్ రాజ్ కాలంలో ఒక్క పెద్ద హాస్పిటల్ కానీ, ఒక్క మెడికల్ కాలేజీ కానీ నిర్మించలేదు. బిహార్ యువతకు అవకాశాలు లేకుండా చేశారు. కాని ఇప్పుడు మేము ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తున్నాం” అని వివరించారు.
అదేవిధంగా, “ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తోంది. పేదలకు ఇళ్లు, మహిళలకు గ్యాస్ సిలిండర్లు, రైతులకు మద్దతు ధర, యువతకు స్కిల్స్ ఇవన్నీ మేము అందించాం. కానీ ఆర్జేడీ పాలనలో ప్రజలకు దొరికింది భయం, దోపిడీ, అవినీతి మాత్రమే” అని మోదీ మండిపడ్డారు.
ప్రచార సభలో భారీగా జనసంద్రం హాజరయ్యింది. “మోదీ, మోదీ” నినాదాలతో వేదిక మార్మోగింది. బిహార్ అభివృద్ధి, యువత భవిష్యత్తు కోసం ఎన్డీఏ ప్రభుత్వమే అవసరమని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ‘గన్స్ కావాలా? ల్యాప్టాప్స్ కావాలా?’ అనే ఆయన ప్రశ్న ఇప్పుడు ఎన్నికల చర్చకు కేంద్రబిందువుగా మారింది.