హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించిన అడ్డంకులు తొలగడంతో ఏపీపీఎస్సీ ఎట్టకేలకు గ్రూప్–1 అభ్యర్థుల ఎంపిక జాబితాను విడుదల చేసింది. నిన్న సాయంత్రం ప్రకటించిన ఈ జాబితాలో మొత్తం 89 పోస్టులకు గాను 87 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. క్రీడా కోటాకు సంబంధించిన రెండు పోస్టులను రిజర్వ్ చేయాలని హైకోర్టు ఆదేశించడంతో వాటిని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు వెల్లడించింది.
క్రీడా కోటా పరిధిలోకి వచ్చే సహాయ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ మరియు డీఎస్పీ పోస్టుల విషయంలో కోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఈ పోస్టులపై తుది నిర్ణయం న్యాయస్థానం ఆదేశాల అనంతరం తీసుకుంటామని పేర్కొంది.
గ్రూప్–1 పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ 2023 డిసెంబరు 8న నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 2024 మార్చి 17న ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించగా, 2025 మే నెలలో మెయిన్స్ పరీక్షలు పూర్తయ్యాయి. అదే ఏడాది జూన్‌లో మెయిన్స్ ఫలితాలను ప్రకటించారు. అనంతరం 2025 జూన్ 23 నుంచి జులై 15 వరకు జనరల్ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. క్రీడా కోటాకు సంబంధించిన అభ్యర్థుల ఇంటర్వ్యూలు ఈ ఏడాది జనవరి 7న ముగిశాయి.
ఈ ఎంపిక జాబితాలో డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 9, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ 17, డీఎస్పీ పోస్టులు 25 ఉన్నాయి. అదనంగా డీఎస్పీ (జైళ్లు) ఒకటి, డివిజనల్/జిల్లా ఫైర్ సర్వీస్ అధికారి రెండు, ఆర్టీవోలు ఆరు పోస్టులు ఉన్నాయి. అలాగే జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఒకటి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి మూడు, డిప్యూటీ రిజిస్ట్రార్స్ ఆరు, పురపాలక కమిషనర్ (సెకండ్ గ్రేడ్) మూడు పోస్టులకు అభ్యర్థులు ఎంపికయ్యారు. సహాయ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఒకటి, సహాయ ట్రెజరీ అధికారి/సహాయ అకౌంటింగ్ అధికారి మూడు, జిల్లా ఉపాధి కల్పన అధికారి నాలుగు, సహాయ ఆడిట్ అధికారి రెండు, మండలాభివృద్ధి అధికారి నాలుగు పోస్టులకు ఎంపిక జరిగింది.