ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు. గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో పూర్తిగా విఫలమైందని విమర్శించిన ఆమె, తమ కూటమి ప్రభుత్వం త్వరలోనే జాబ్ క్యాలెండర్ ( JobCalendar) విడుదల చేసి ఖాళీలను భర్తీ చేస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే 6 వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ (Police Recruitment) చేశామని, వారి స్టైపెండ్‌ను మూడు రెట్లు పెంచినట్లు వెల్లడించారు. ఇకపై ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి పోలీస్, జైళ్లు, అగ్నిమాపక శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు.
నెల్లూరు సెంట్రల్ జైలును సందర్శించిన హోంమంత్రి ఖైదీలకు అందుతున్న వసతులు, భోజనం, భద్రతా ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జైలులో ఖైదీలు తయారు చేస్తున్న పేస్టులు, షాంపూలు, నూనెలు, బీరువాలు, స్కూల్ బెంచీలు వంటి వస్తువులను పరిశీలించారు. ఖైదీలకు ఉపాధి కల్పించడం ద్వారా వారు నెలకు రూ.7,000 నుంచి రూ.8,000 వరకు సంపాదించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆమె తెలిపారు. జైలులో మెరుగైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని హోంమంత్రి అనిత (Home Minister Anitha)హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని, కత్తులతో రోడ్లపై తిరిగే వారిని సహించేది లేదన్నారు. నేరం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో నేరస్తులను ప్రజల్లో అవమానించే విధానాన్ని పోలీసులు అమలు చేయడాన్ని ఆమె ప్రశంసిస్తూ, ఈ విధానం రాష్ట్రవ్యాప్తంగా అమలైతే నేరాలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు.
ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను ఎప్పుడు విడుదల చేయనుంది?
కూటమి ప్రభుత్వం త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేస్తుందని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు.
ఇప్పటివరకు ఎన్ని పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేశారు?
ఇప్పటికే 6,000 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేశామని, వారి స్టైపెండ్‌ను మూడు రెట్లు పెంచినట్లు హోంమంత్రి తెలిపారు.