ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత సుందరమైన మరియు ప్రఖ్యాత పర్యాటక నగరంగా విశాఖపట్నంకు ఎంతో మంచి పేరుంది. విశాలమైన తీర ప్రాంతం, అద్భుతమైన బీచ్‌లతో (రామకృష్ణ బీచ్, రుషికొండ, భీమిలి) విశాఖ ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. అటువంటి అందమైన నగరాన్ని చూడడానికి నిత్యం పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యాటక రంగానికి మరింత ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో భాగంగా, APSRTC విశాఖ నగరానికి వచ్చే పర్యాటకుల కోసం ఒక అద్భుతమైన ఆఫర్‌ను కొనసాగిస్తోంది.
APSRTC అమలు చేస్తున్న ఈ బంపర్ ఆఫర్ పేరు.. 'ట్రావెల్ యాజ్ యు లైక్'. కేవలం రూ.100 చెల్లిస్తే చాలు. ఈ టికెట్‌తో రోజంతా (24 గంటల్లోపు) విశాఖ నగరంలో ఎక్కడ నుంచైనా, ఎక్కడికైనా ప్రయాణించవచ్చు.
ఈ పథకం పర్యాటకులకు మాత్రమే కాకుండా, సాధారణ ప్రజలకు, కుటుంబ సభ్యులకు కూడా ఎంతో మేలు చేకూరుస్తుంది. ఇప్పటికే 'స్త్రీ శక్తి' పేరుతో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంది. ఇప్పుడు పురుషులకు, కుటుంబ సభ్యులకు కూడా ఈ రూ.100 టికెట్ చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా కుటుంబమంతా తక్కువ ఖర్చుతో విశాఖ నగరాన్ని సునాయాసంగా చుట్టిరావచ్చు.
విశాఖ నగర విస్తీర్ణం దాదాపు 100 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ టికెట్‌తో మీరు సందర్శించగలిగే కొన్ని ప్రధాన పర్యాటక ప్రాంతాలు.. రామకృష్ణ బీచ్, కైలాసగిరి, ఋషికొండ బీచ్, భీమిలి బీచ్, ఎండాడ బీచ్. (ఈ బీచ్‌ల మధ్య దూరం కూడా దాదాపు 30కి.మీ. వరకు ఉంటుంది.)
తొట్లకొండ, ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్, సింహాచలం, విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి ఇతర ఆకర్షణలు. రూ.100తో 100కి.మీ. మేర విస్తరించి ఉన్న ఈ అన్ని ప్రాంతాలను చుట్టిరావడం వల్ల పర్యాటకులు భారీగా డబ్బును ఆదా చేసుకోవచ్చు.
ఈ అరుదైన ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడం చాలా సులభం..
విశాఖ నగరంలోని ఏ APSRTC బస్సు ఎక్కినా కండక్టర్‌ను అడిగి ఈ 'ట్రావెల్ యాజ్ యు లైక్' టికెట్‌ను తీసుకోవచ్చు.
సిటీ, ఆర్డినరీ, మెట్రో బస్సులలో ఈ టికెట్ అందుబాటులో ఉంది. టికెట్ కొనుగోలు చేసిన తర్వాత 24 గంటల లోపు మాత్రమే పనిచేస్తుంది.
ఈ టికెట్ కొనుగోలు చేయడం ద్వారా డబ్బులు ఆదా మాత్రమే కాకుండా, పర్యాటక ప్రాంతాలను సులభంగా, సునాయాసంగా, ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ అద్భుతమైన ఆఫర్ ఇచ్చినందుకు ఏపీఎస్ఆర్టీసీకి పర్యాటకులు, స్థానికులు ధన్యవాదాలు తెలుపుతున్నారు.