Credit Score: ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి దగ్గర క్రెడిట్ కార్డు ఉండటం సాధారణమే. కానీ ప్రతిసారీ బిల్లులు సమయానికి చెల్లించినా కూడా నా క్రెడిట్ స్కోరు ఎందుకు పెరగడం లేదు? అన్న ప్రశ్న చాలామందిని వేధిస్తుంది. వాస్తవానికి స్కోరు అంటే కేవలం చెల్లింపు రికార్డు మాత్రమే కాదు — మొత్తం ఆర్థిక వ్యవహారాలపై ఆధారపడే మిర్రర్‌లాంటిది.
బ్యాంకులు మీకు ఇచ్చిన లిమిట్‌లో ఎంత శాతం మీరు వాడుతున్నారో క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో’ (C.U.R) చెబుతుంది. ఆ లిమిట్‌లో 30% కంటే ఎక్కువ వాడితే, మీరు బిల్లు చెల్లించినా స్కోరు కిందపడుతుంది. ఎందుకంటే అధిక వినియోగం అంటే బ్యాంక్ దృష్టిలో ఫైనాన్షియల్ స్ట్రెస్ సంకేతం. కాబట్టి క్రెడిట్ లిమిట్‌ని పూర్ణంగా వాడడం కంటే నియంత్రణలో ఉంచడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.
కేవలం క్రెడిట్ కార్డు కాకుండా పర్సనల్ లోన్ హోమ్ లోన్, వాహన రుణం వంటి విభిన్న రుణాలు ఉంటే వాటన్నింటినీ సకాలంలో చెల్లిస్తే స్కోరు త్వరగా పెరుగుతుంది. ఈ వైవిధ్యం అంటే మీరు రుణాలను సరిగ్గా నిర్వహించగల సామర్థ్యం ఉన్నవారిగా బ్యాంక్‌లు భావిస్తాయి.
మార్కెట్లో కొత్త రివార్డ్స్ ఆఫర్లు వస్తే వెంటనే కొత్త క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసే వారు ఎక్కువ. కానీ ప్రతి దరఖాస్తు ఒక హార్డ్ ఇంక్వైరీ గా మీ రిపోర్ట్‌లో చేరుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ అప్లికేషన్లు అంటే బ్యాంకులు ఇతనికి నిధులు అవసరం ఎక్కువ అని భావిస్తాయి. ఫలితం స్కోరు క్షీణిస్తుంది.
మీరు సహదరఖాస్తుదారుగా ఉన్న రుణంలో ప్రధాన రుణగ్రాహకుడు చెల్లింపులు ఆలస్యం చేస్తే, ఆ ప్రభావం మీ స్కోరుపై కూడా ఉంటుంది. అంటే ఇతరుల తప్పిదం మీ ఫైనాన్షియల్ ఇమేజ్‌ను దెబ్బతీయవచ్చు.
చాలామంది తమ క్రెడిట్ రిపోర్ట్‌ని చూడరు. కానీ అందులో పాత డేటా, పొరపాట్లు, తప్పుగా చూపిన బకాయిలు ఉంటే అవే స్కోరును తగ్గిస్తాయి. కనీసం ఆరు నెలలకొకసారి క్రెడిట్ రిపోర్ట్‌ని చెక్ చేయడం అలవాటు చేసుకోవాలి.
ఫైనాన్షియల్ నిపుణుల ప్రకారం, సకాలంలో చెల్లింపులు చేయడం, వినియోగాన్ని పరిమితి లోపల ఉంచడం, అవసరమైతేనే రుణాలు తీసుకోవడం ఇవన్నీ కలిసి మీ క్రెడిట్ స్కోరును స్థిరంగా పెంచుతాయి.