ప్రపంచవ్యాప్తంగా వైద్యరంగంలో అప్పుడప్పుడు ఆశ్చర్యకరమైన ఘటనలు వెలుగులోకి వస్తుంటాయి. అలాంటి ఒక కేసు ఇటీవల చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. కేవలం 15 ఏళ్ల బాలిక కడుపులో నుంచి వైద్యులు 2 కిలోల బరువైన హెయిర్‌బాల్ (వెంట్రుకల గడ్డ) తొలగించారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్నవారందరూ ఆశ్చర్యపోయారు.
ఈ బాలిక పేరు నీనీ. సాధారణంగా కనిపించే ఒక అమ్మాయి, కానీ శరీర బరువు కేవలం 35 కిలోలు, ఎత్తు 1.6 మీటర్లు మాత్రమే. పైగా ఆరు నెలలుగా రుతుక్రమం జరగకపోవడం, తరచూ తీవ్రమైన కడుపు నొప్పి రావడం, ఆహారం సరిగ్గా తినలేకపోవడం వంటి సమస్యలు ఆమెను, ఆమె తల్లిని తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. నీనీ తన బాధను తల్లికి వివరించగా, ఆమెను వుహాన్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు చేసిన పరీక్షల్లో ఒక పెద్ద సీక్రెట్ వెలుగులోకి వచ్చింది.
నీనీ తల్లి వైద్యులకు ఒక షాకింగ్ విషయాన్ని చెప్పారు. గత ఆరేళ్లుగా తన కూతురు తన జుట్టును తానే తింటోందని తెలిపారు. ఈ అలవాటు వల్ల కడుపులోకి చేరిన వెంట్రుకలు క్రమంగా ఒక గట్టిగా గడ్డలా మారాయి. వైద్యులు దీన్ని "హెయిర్‌బాల్" లేదా "ట్రైకోబెజోర్" అని పిలుస్తారు. ఇలా పేరుకుపోయిన వెంట్రుకలు క్రమంగా కడుపు పనితీరును దెబ్బతీశాయి. దీంతో నీనీకి రక్తహీనత, బరువు తగ్గడం, రుతుక్రమం ఆగిపోవడం వంటి సమస్యలు వచ్చాయి.
జూలై 14న వైద్యులు నీనీకి శస్త్రచికిత్స చేశారు. శస్త్రచికిత్స సమయంలో వైద్యులు ఆమె కడుపులోని వెంట్రుకల గడ్డను బయటకు తీయగా అందరూ ఆశ్చర్యపోయారు. అది 2 కిలోల బరువుతో పెద్ద బంతి లా తయారైందని తెలిసింది. వైద్యులు కూడా అలాంటి అరుదైన కేసును చూసి ఆశ్చర్యపోయారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
చికిత్స అనంతరం నీనీ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది. ఈ నెల 5న చెకప్ కోసం తిరిగి ఆసుపత్రికి వచ్చినప్పుడు, నీనీ వైద్యులకు స్వీట్స్‌తో తయారు చేసిన బొకేను అందజేసి తన కృతజ్ఞతను తెలిపింది.
ఆమె తల్లి మాట్లాడుతూ, “ఇప్పుడిప్పుడే మా కూతురు బరువు పెరుగుతోంది. కడుపు నొప్పి తగ్గింది. మేము ఊపిరి పీల్చుకున్నాం,” అని హృదయపూర్వకంగా అన్నారు.
ఇలాంటి అరుదైన కేసులు భారత్‌లో కూడా నమోదయ్యాయి. జైపూర్‌లోని SMS ఆసుపత్రిలో 14 ఏళ్ల బాలిక కడుపులో నుండి 210 సెం.మీ పొడవైన వెంట్రుకల గడ్డ తొలగించారు. అంతకుముందు రికార్డు 180 సెం.మీ ఉండగా, ఇది అతి పొడవైనదిగా వైద్యులు తెలిపారు. ఆ బాలిక కూడా కడుపు నొప్పి, వాంతులతో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చినప్పుడు ఈ విషయం బయటపడింది.
వైద్యుల ప్రకారం, జుట్టును తినే అలవాటు ఒక రకమైన మానసిక సమస్య (Trichophagia). దీనిని తేలికగా తీసుకోవడం ప్రమాదకరం. ఎందుకంటే జుట్టు జీర్ణం కాదని, అది కడుపులో పేరుకుపోతూ ప్రాణాంతక స్థితికి దారితీస్తుందని చెబుతున్నారు. సమస్యను ముందుగానే గుర్తిస్తే, సైకలాజికల్ కౌన్సెలింగ్ ద్వారా పిల్లల్లో ఈ అలవాటును తగ్గించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
నీనీ కేసు మనందరికీ ఒక పాఠం చెబుతోంది. చిన్నప్పటి నుండి పిల్లల్లో కనిపించే వింత అలవాట్లను తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా గమనించాలి. సమయానికి వైద్యులను సంప్రదిస్తే, ప్రమాదాలను తప్పించవచ్చు.