తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒకొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళుతోంది. గత బీఆర్ఎస్ పాలనలో ప్రారంభమైన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయబోతోంది. అప్పట్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేసి, అర్హులైన ప్రజలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో ఇటీవలి కాలంలో ఈ పంపిణీకి గ్రీన్ సిగ్నల్ లభించింది.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిర్వహించిన ration card పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా, అర్హులైన ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు కల నెరవేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చాలా మంది అర్హులకు రేషన్ కార్డులు మంజూరవలసినప్పటికీ ఇవ్వలేదని ఆయన విమర్శించారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఈ లోటును తీర్చేలా పని చేస్తోందని చెప్పారు.
ఈ శ్రావణ మాసంలోనే రేషన్ కార్డుల పంపిణీతో పాటు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ కూడా ప్రారంభం కానుందని మంత్రి వెల్లడించారు. అలాగే ప్రతి కుటుంబానికి నెలకు 6 కిలోల సన్న బియ్యం అందిస్తున్నామని చెప్పారు. గతంలో ధనవంతులకే పరిమితమైన సన్న బియ్యం ఇప్పుడు పేదలకు కూడా లభిస్తోందని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వం పేదల పట్ల చూపుతోన్న commitment ను సూచిస్తున్నదన్నారు.
ఇంకా, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఆయా నియోజకవర్గాలకు 3,500 ఇళ్లు కేటాయించనున్నట్టు మంత్రి తెలిపారు. ఉపాధి ఉన్న ప్రాంతాలకే ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోందని, దీని వల్ల ప్రజలకు జీవనోపాధి కూడా సమీపంలోనే దొరుకుతుందని వివరించారు. ఈ విధంగా ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమం పై ప్రత్యేక దృష్టి పెడుతోంది.