ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు భూముల యాజమాన్య హక్కులను స్పష్టంగా నిర్ధారించడానికి స్వామిత్వ పథకాన్ని వేగవంతంగా అమలు చేయడం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ప్రజలకు తమ ఆస్తులపై పూర్తి హక్కులు లభిస్తాయి. 2026 మార్చి నాటికి మొత్తం 45 లక్షల ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు అందించడం లక్ష్యం.
దశాబ్దాలుగా గ్రామాల్లో ఉన్న ఇళ్లకు, భూములకు సరైన యాజమాన్య పత్రాలు లేవు. చాలా సార్లు ఆస్తులను అమ్మినా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నమోదు చేయడం కష్టం. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్రం ప్రవేశపెట్టిన స్వామిత్వ పథకం ప్రజలకు పెద్ద ఉపశమనంగా నిలుస్తుంది.
ప్రతీ ఆస్తి యొక్క ఖచ్చితమైన కొలతలు, సరిహద్దులను నిర్ధారించడానికి డ్రోన్ల సాయంతో సర్వేలు చేపట్టారు. ప్రస్తుతం 6,000 గ్రామాల్లో ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ . ఆధారంగా ఆస్తుల వివరాలు సేకరించబడుతున్నాయి. సర్వే పూర్తయ్యాక ప్రజలకు నోటీసులు పంపబడతాయి. ఆ నోటీసుల్లోని వివరాలపై ఎవరికి ఏవైనా అభ్యంతరాలు ఉంటే వారు అధికారులకు తెలియజేయవచ్చు. అభ్యంతరాలు పరిశీలించిన తర్వాత అధికారికంగా ఆస్తుల యాజమాన్య హక్కులు నిర్ధారించబడతాయి.
ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నం ఉన్న స్వామిత్వ కార్డులు ఇవ్వబడతాయి. కార్డుల ద్వారా ఆస్తులను అమ్మడం, కొనుగోలు చేయడం బ్యాంకుల నుండి రుణాలు పొందడం సులభమవుతుంది. అలాగే వారసులకు ఆస్తులను బదిలీ చేయడం కూడా తేలికవుతుంది.
ప్రస్తుతం 43 లక్షల ఆస్తుల సర్వే పూర్తయి, మిగిలిన ఆస్తుల తనిఖీ కూడా కొన్ని రోజుల్లో పూర్తి కానుంది. తరువాత సెక్షన్ 9(2) ప్రకారం నోటీసులు జారీ చేయబడతాయి. ఆ తర్వాత సెక్షన్ 13 కింద సర్వే ఫైనల్‌గా అధికారికంగా ప్రకటించబడుతుంది.
ప్రతి గ్రామంలో ప్రతీ ఇంటి స్థలం వివరాలు ఖచ్చితంగా నమోదు చేయబడడంతో ప్రజలకు తమ ఆస్తులపై పూర్తి హక్కులు లభించడం ఖాయం. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించి, ప్రజల భవిష్యత్తుకు మద్దతు ఇస్తుంది.