ఏపీ రాష్ట్ర ఉద్యోగ కల్పన, వ్యవస్థాపకాభివృద్ధి సంస్థ(సీడాప్) ద్వారా 50వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. సీడాప్, ఇండోయూరో సింక్రనైజేషన్ అండ్ జర్మన్ హెల్త్కేర్ సంయుక్త భాగస్వామ్యంతో అమలు చేస్తున్న అంతర్జాతీయ ఉపాధి కల్పన పథకం కింద 14మంది నర్సింగ్, ఆరోగ్య సంరక్షణ నిపుణులకు జర్మనీలో ఉద్యోగాలు కల్పిస్తూ కాల్ లెటర్స్ అందాయి.
కాల్ లెటర్లు అందుకున్న అభ్యర్థులను శనివారం ఉండవల్లిలోని నివాసంలో మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “తొలి బ్యాచ్లో సీడాప్ ద్వారా 171 మందికి శిక్షణ ఇవ్వగా ఇప్పటికే వివిధ విభాగాల్లో 40 మంది ఎంపికయ్యారు. మరో 14మంది త్వరలోనే జర్మనీ వెళ్తున్నారు. మిగతా వారికీ ఉద్యోగాలు లభిస్తాయి. అంతర్జాతీయ అవకాశాలను మన విద్యార్థులు అందిపుచ్చుకునే విధంగా సీడాప్-ఓంక్యాప్ ద్వారా విదేశీ భాషలపై శిక్షణ ఇస్తున్నాం.
చదువుతోపాటు విదేశీ భాషల్లో శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకున్నాం. జర్మనీలో కొలువులు పొందిన ఒక్కొక్కరు మరో పదిమంది ఉద్యోగాలు సాధించేలా మార్గదర్శకం చేయాలి. ఈ నెలలో నైపుణ్య పోర్టలు ప్రారంభించబోతున్నాం. సమాజాభివృద్ధిలో మహిళా సాధికారత కీలక పాత్రపోషిస్తుంది. మహిళలను కించపర్చే సినిమాలను సైతం విడుదల కాకుండా అడ్డుకోవాలన్నదే తమ అభిమతం” అని తెలిపారు.
ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను మంత్రి లోకేశ్ సన్మానించారు. వారికి ట్యాబ్లు అందించారు. బీఎస్సీ నర్సింగ్ కోర్సు పూర్తి చేసి, స్థానిక ఆసుపత్రుల్లో నెలకు రూ.15వేల నుంచి రూ.20వేలకు పని చేసే తమకు జర్మనీలో రూ.2.8లక్షల వేతనంతో ఉద్యోగం లభించడం కలగా ఉందని పేర్కొంటూ అభ్యర్థులు భావోద్వేగానికి గురయ్యారు.
ఉద్యోగాలు సాధించిన 14మందిలో 9మంది నిరుపేద ఎస్సీ కుటుంబాలకు చెందిన వారు కాగా.. ముగ్గురు బీసీలు ఉన్నారు. జర్మనీలో ఇవే ఉద్యోగాల కోసం కన్సల్టెన్సీలను శిక్షణ కోసం సంప్రదిస్తే రూ.8 లక్షల వరకు అడిగారని, అంత డబ్బు చెల్లించే ఆర్థిక స్తోమత తమకు లేదని పేర్కొన్నారు. సీడాప్ ద్వారా ఒక్క రూపాయి తీసుకోకుండా జర్మన్ భాషలో శిక్షణ ఇచ్చి, ఉద్యోగం వచ్చేలా చేశారని తెలిపారు.
తమ కలను సాకారం చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్లను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. ఈ కార్యక్రమంలో సీడాప్ ఛైర్మన్ దీపన్రెడ్డి, సీఈఓ నారాయణస్వామి, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ గణేష్కుమార్ పాల్గొన్నారు.