భారతీయ రైల్వేలు సాధారణ ప్రయాణికులకే కాకుండా లగ్జరీ ట్రావెల్‌కి కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నాయి. రాజభవనాల్లాంటి సౌకర్యాలు, చారిత్రక వారసత్వాన్ని చూపించే ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు మరపురాని అనుభవం ఇస్తాయి. వీటిలో మహారాజాస్ ఎక్స్‌ప్రెస్, డెక్కన్ ఒడిస్సీ, రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్, గోల్డెన్ చారియట్, ప్యాలెస్ ఆన్ వీల్స్ ముఖ్యమైనవిగా గుర్తింపు పొందాయి. ఒక్కసారి ఎక్కినా రాచరిక జీవనాన్ని అనుభవించినట్లే ఉంటుంది.
మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ వరుసగా ఆరు సంవత్సరాలు ప్రపంచంలోనే ఉత్తమ లగ్జరీ రైలు బిరుదు గెలుచుకుంది. ఢిల్లీ, త్రివేండ్రం నుంచి బయలుదేరే ఈ రైలు రాజస్థాన్ కోటలు, చారిత్రక ప్రాంతాలు, వారసత్వ ప్రదేశాలను చూపిస్తుంది. ఇందులో డీలక్స్ క్యాబిన్ నుంచి ప్రెసిడెన్షియల్ సూట్ వరకు ఆప్షన్లు ఉంటాయి. ఏ ప్యాకేజీ అయినా దాదాపు వారం రోజులపాటు ఉంటుంది. ప్రెసిడెన్షియల్ సూట్‌లో ప్రయాణం చేయాలంటే దాదాపు 25 వేల డాలర్లు ఖర్చవుతుంది.
డెక్కన్ ఒడిస్సీ నీలం రంగులో మెరిసే రైలు. ఇది మహారాజుల రథం లాంటి అనుభూతిని ఇస్తుంది. లగ్జరీ క్యాబిన్లు, మల్టీ క్యూసిన్ రెస్టారెంట్లు, స్పా సౌకర్యాలు ప్రయాణాన్ని ప్రత్యేకంగా చేస్తాయి. తాజ్ గ్రూప్ దీన్ని నిర్వహిస్తోంది. ముంబై, ఢిల్లీ నుంచి బయలుదేరి పలు నగరాలను కవర్ చేస్తుంది. డీలక్స్ క్యాబిన్‌లో ఒకరికి దాదాపు 9,330 డాలర్లు, ప్రెసిడెన్షియల్ సూట్‌కి 20 వేల డాలర్లు తీసుకుంటారు.
రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్ రైలు ప్రతి స్టేషన్‌లో రాజస్థాన్ వారసత్వాన్ని చూపిస్తుంది. రాజభవనాల్లాంటి క్యాబిన్లు దీని ప్రత్యేకత. ఢిల్లీలో నుంచి బయలుదేరే ఈ రైలు పీక్ సీజన్‌లో డీలక్స్ క్యాబిన్ ధర దాదాపు 9.85 లక్షల రూపాయలు. గోల్డెన్ చారియట్ మాత్రం కర్ణాటక పర్యాటక శాఖ నిర్వహిస్తుంది. మైసూర్ శైలిలో డిజైన్ చేసిన ఈ రైలు చారిత్రక ప్రదేశాలు, ప్రకృతి అందాలను చూపిస్తుంది. దీని ప్యాకేజీ ధర సుమారు 4,740 డాలర్లు.
ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలు భారతదేశంలో లగ్జరీ రైళ్ల చరిత్రను మలిచింది. రాజులు, నిజాముల కాలం నుంచే ఇది ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల కొత్త ఫెసిలిటీలతో మళ్లీ లాంచ్ అయ్యింది. జైపూర్ నుంచి బయలుదేరే ఈ రైలు రాజస్థాన్ వారసత్వాన్ని చూపిస్తుంది. డీలక్స్ క్యాబిన్ ఛార్జీలు విదేశీయులకు 10,507 డాలర్లు కాగా, భారతీయులకు రూ.8.61 లక్షలు. ఈ రైలు నిజంగా రాజప్రసాదంలో ఉన్నట్లే అనుభూతి కలిగిస్తుంది.