రష్యా దాడులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌కు అమెరికా మరోసారి అండగా నిలిచింది. కీవ్ గగనతల రక్షణను బలోపేతం చేసేందుకు 3,350కి పైగా అత్యాధునిక ఎక్స్‌టెండెడ్ రేంజ్ అటాక్ మ్యూనిషన్ (ERAM) క్షిపణులను సరఫరా చేయడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు.
అయితే, ఈ శక్తివంతమైన క్షిపణులను రష్యా భూభాగంపై ఉపయోగించాలంటే పెంటగాన్ అనుమతి తప్పనిసరి అన్న షరతు విధించారు. 240 నుంచి 450 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణులు వచ్చే ఆరు వారాల్లో ఉక్రెయిన్‌కు చేరనున్నాయి.
ఇక మొత్తం 32.2 కోట్ల డాలర్ల ప్యాకేజీలో భాగంగా అమెరికా ఈ సాయాన్ని అందిస్తోంది. ఇందులో 17.2 కోట్ల డాలర్లు గగనతల రక్షణ వ్యవస్థల కోసం, మరో 15 కోట్ల డాలర్లు ఆర్మర్డ్ వాహనాల నిర్వహణ కోసం కేటాయించారు.
యూరోపియన్ దేశాలు ఈ ఆయుధాల కొనుగోలుకు నిధులు సమకూర్చుతున్నాయి. ఇటీవల రష్యా దాడులు తీవ్రతరమైన నేపథ్యంలోనే ఈ సాయం అందించామని ట్రంప్ స్పష్టం చేశారు.