మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ, సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యం, భద్రతకు పెద్దపీట వేస్తోందన్నారు. ఏడాదిలోపే రూ.143 కోట్లతో హాస్టళ్లకు మరమ్మతులు చేపట్టామని, అదేవిధంగా రూ.100 కోట్లతో కొత్త హాస్టళ్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేక వైద్య అధికారిని నియమించినట్లు చెప్పారు.
అనారోగ్యంతో మరణించిన గురుకులాల విద్యార్థుల కుటుంబాలకు 'సాంత్వన' పథకం ద్వారా రూ.3 లక్షల నష్టపరిహారం అందిస్తున్నామని వివరించారు. గత వైసీపీ పాలనలో హాస్టళ్లకు కనీస మెయింటెనెన్స్ నిధులు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు తమ ప్రభుత్వం విద్యార్థుల కోసం మేలు చేస్తుంటే జగన్ ఆధ్వర్యంలోని వైసీపీ దుష్ప్రచారాలకు దిగుతోందని మండిపడ్డారు.