రష్యాలో భారతీయ కార్మికులకు, నిపుణులకు ఉద్యోగావకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఎక్కువగా నిర్మాణం, టెక్స్‌టైల్ రంగాల్లోనే మనవాళ్లు పనిచేస్తుండగా, ఇప్పుడు మెషినరీ, ఎలక్ట్రానిక్స్ వంటి కీలక సాంకేతిక రంగాల్లోనూ రష్యన్ కంపెనీలు భారతీయులను నియమించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి.
ఈ విషయాన్ని రష్యాలో భారత రాయబారి వినయ్ కుమార్ వెల్లడించారు. ఆయన రష్యా ప్రభుత్వ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "రష్యాలో మానవ వనరుల అవసరం ఎక్కువగా ఉంది. మరోవైపు భారత్‌లో నైపుణ్యం కలిగిన మానవశక్తి అందుబాటులో ఉంది. అందుకే రష్యన్ కంపెనీలు భారతీయులను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. చట్టాలు, కోటా పరిమితులకు లోబడి ప్రస్తుతం నియామకాలు జరుగుతున్నాయి" అని తెలిపారు.
ఉద్యోగాల కోసం అధిక సంఖ్యలో భారతీయులు రష్యాకు వెళ్తుండటంతో రాయబార కార్యాలయంపై పనిభారం పెరిగిందని కూడా ఆయన చెప్పారు. పాస్‌పోర్ట్ పునరుద్ధరణ, పిల్లల జనన ధృవీకరణ, పోయిన పాస్‌పోర్ట్‌ల పునరుద్ధరణ వంటి సేవలకు భారీ డిమాండ్ ఉందని వివరించారు.
అమెరికా, కెనడా, యూకే వంటి దేశాలు వలసల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్న సమయంలో, రష్యా భారతీయులకు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్-రష్యా మధ్య ఉన్న స్నేహ సంబంధాలు ఉపాధి అవకాశాలను మరింత బలోపేతం చేస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.