ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం హరి హర వీరమల్లు పైరసీ సవాలును ఎదుర్కొంటోంది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వచ్చిన మొదటి సినిమా కావడంతో ఈ చిత్రంపై అభిమానులతో పాటు సినీ ప్రేమికుల్లోనూ భారీ ఉత్సాహం కనిపించింది. అయితే సినిమా విడుదలై కొన్ని రోజుల్లోనే పైరసీ రూపంలో ప్రింట్ లీక్ కావడంతో అభిమానులు, చిత్రబృందం ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో తిరుపతికి చెందిన జనసేన నాయకుడు కిరణ్ రాయల్, ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. Ibomma, Movierulz వంటి వెబ్‌సైట్లలో ఈ సినిమాను అక్రమంగా అప్‌లోడ్ చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో తెలిపారు. పైరసీ వెబ్‌సైట్లపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తక్షణమే సినిమాను వాటి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే, విద్యార్థుల కోసం ఉచిత ప్రదర్శనల కార్యక్రమం కూడా జోరుగా కొనసాగుతోంది. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని మూడు మండలాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఉచితంగా హరి హర వీరమల్లు సినిమాను ప్రదర్శించనున్నారు. 9వ తరగతి నుంచి డిగ్రీ వరకూ విద్యార్థులకు భారతీయ చరిత్ర, సంస్కృతిని అవగాహన చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
అంతేకాకుండా, జూలై 26, 27 తేదీల్లో ఢిల్లీలోని ఏపీ భవన్ అంబేద్కర్ ఆడిటోరియంలో కూడా ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. పవన్ నటించిన చారిత్రాత్మక సినిమాకు మొదటి వారంలోనే వచ్చిన పైరసీ షాక్ ఒకవైపు అయితే, విద్యార్థులకు ఉచిత ప్రదర్శనలుగా మరొకవైపు ప్రచారం ఊపందుకోవడం విశేషం.