అనకాపల్లిలోని ఎన్టీఆర్ ప్రభుత్వాసుపత్రిలో 2020లో జరిగిన అక్రమాలకు సంబంధించి 22 మంది డాక్టర్లు, నర్సులపై విచారణ చేపట్టాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఆ ఏడాది ఫిబ్రవరిలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు చేపట్టగా అవినీతి బయటపడింది.
ఆ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకున్న మంత్రి సత్యకుమార్.. చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రిలో ఇన్ పేషంట్లపై తప్పుడు లెక్కలు, మందుల వినియోగాన్ని సరిగా చూపించకపోవడం, అవినీతి, పాలనా వైఫల్యాలు, పర్యవేక్షణ లోపాలు ఉన్నట్లు ఏసీబీ తమ నివేదికలో పేర్కొంది.
దీంతో డీసీహెచ్ఎస్ఈతోపాటు మరో తొమ్మిది మంది వైద్యులు, 12 మంది హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులపై తక్షణమే విచారణ చేపట్టాలని, ఏసీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వాసుపత్రుల్లో మార్పు తెచ్చేందుకు పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి సత్యకుమార్ ఆదేశించారు.