ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆలయాలకు మహర్దశ పట్టనుంది. దేవాలయాల అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రూ.772 కోట్లతో రాష్ట్రంలోని 9వేలకు పైగా ఆలయాలను అభివృద్ధి చేయనుంది. ఈ విషయాన్ని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. 772 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రాష్ట్రంలోని 9098 ఆలయాలను పునర్నిర్మించనున్నట్లు మంత్రి వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరసవెల్లి సూర్యనారాయణస్వామి ఆలయాన్ని సందర్శించారు. అలాగే శ్రీకూర్మనాథ ఆలయాన్ని స్థానిక ఎమ్మెల్యే శంకర్‌తో కలిసి దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.." రాష్ట్రంలోని ఆలయాల పునర్నిర్మాణం కోసం ఏడాదిలోపు 772 కోట్లు వినియోగిస్తాం. ధూపం, దీప, నైవేద్యాల కోసం 5,523 దేవాలయాలకు ఒక్కొక్కదానికి రూ.10,000 చొప్పున అందిస్తాం, ఈ మొత్తం రూ.66.27 కోట్లు. శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా ఐదు దేవాలయాలను ఇందులోకి చేర్చాం. దీనికి అదనంగా, రూ.5 కోట్లతో మూడు దేవాలయాలను పునర్నిర్మిస్తున్నారు, దీని కోసం ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశాం." అని చెప్పుకొచ్చారు. మరోవైపు శ్రీకాకుళం ప్రాంతాన్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆనం రామనారాయణరెడ్డి చెప్పుకొచ్చారు.
శ్రీకాకుళం జిల్లాలో ఆలయాల అభివృద్ధికి ఇప్పటికే కోటీ 96 లక్షలు కేటాయించామని.. రూ.12.75 కోట్లతో మరో 20 పనులను కేటాయించినట్లు తెలిపారు. జిల్లాలోని 157 దేవాలయాలకు ఒక్కొక్క ఆలయానికి రూ.10000 చొప్పున అందించినట్లు వివరించారు. మరోవైపు విశాఖపట్నంలో 76 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒక్కరోజులోనే ఆమోదం లభించిందని తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అన్ని హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు.
మరోవైపు అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. భవిష్యత్ తరాల కోసం అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు.