శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్‌వీ-ఎఫ్16 ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రాకెట్ ద్వారా అత్యాధునిక నైసార్ (NISAR) ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించనున్నారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ రోజు సాయంత్రం 18:59 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది. నైసార్ ఉపగ్రహం సుమారు 2,392 కిలోల బరువు కలిగి ఉండగా, ఇది సూర్య అనువర్తిత కక్ష్యలో 747 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకొని అక్కడ విడిపోనుంది.
ఈ నైసార్ ఉపగ్రహాన్ని ఇస్రో (ISRO) మరియు నాసా (NASA) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. రూ.11,200 కోట్ల వ్యయంతో తయారైన ఈ ఉపగ్రహంలో అధునాతన స్వీప్‌సార్ (SWOT SAR) సాంకేతికతను తొలిసారిగా ఉపయోగిస్తున్నారు. ఇది భూమిపై పంటల ఎదుగుదల, మంచు విస్తీర్ణం, ఉపరితల మార్పులు వంటి అంశాలను త్రీడీ విధంగా అత్యంత స్పష్టతతో గుర్తించగలదు. నైసార్ ఉపగ్రహం ఒకేసారి 240 కి.మీ. వెడల్పు ప్రాంతాన్ని స్కాన్ చేయగల సామర్థ్యంతో, ప్రతి 12 రోజులకు ఒకసారి భూమిపై అన్ని ప్రాంతాలను పరిశీలించనుంది. 97 నిమిషాల వ్యవధిలో భూమిని ఒకసారి చుట్టేయగల నైసార్, భూమి మార్పులను గమనించేందుకు కీలకంగా మారనుంది.