ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నెలలుగా పెండింగ్‌లో ఉన్న రూ.605 కోట్ల వేతన బకాయిలును గురువారం కేంద్రం విడుదల చేసింది. ఈ మొత్తం మరో రెండు నుంచి మూడు రోజుల్లో కూలీల బ్యాంకు ఖాతాల్లో జమకానుంది. అయితే ఇప్పటికీ కేంద్రం రూ.2,500 కోట్లకు పైగా వేతనాలను చెల్లించాల్సి ఉంది.
ఇటీవలి కాలంలో వేతన బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు లేఖ రాయగా, స్పందించిన కేంద్రం మొదటి విడతగా ఈ మొత్తాన్ని విడుదల చేసింది. మిగతా బకాయిలను దశలవారీగా చెల్లించనున్నట్లు సమాచారం.
ఇకపై ఉపాధి హామీ కూలీల వేతనాల కోసం కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. రోజు రెండు సార్లు—ఉదయం 9 గంటలకు, సాయంత్రం 4 గంటలకు—కూలీల ఫోటోలు తీసి నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (NMMS) యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్వహించగా, పంచాయతీ సెక్రటరీలు పర్యవేక్షించాలి. మండల స్థాయి అధికారులు, ఎంపీడీవోలు నివేదికలు సమర్పించాలి.
ఈ వ్యవస్థ ద్వారా గ్రామీణ ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా పర్యవేక్షించడమే లక్ష్యం. కాగా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదల జీవనోపాధిని మెరుగుపరిచే దిశగా ఏర్పాటైనది. వ్యవసాయ రుతువుల మధ్యకాలంలో ఆదాయం అందించేందుకు, గ్రామీణ వలసలను తగ్గించేందుకు ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోంది.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        