బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు అకస్మాత్తుగా మళ్లీ ఎగబాకాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోతలపై అనిశ్చితి, అలాగే కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకోవడం వంటి అంశాలు ఈ పెరుగుదలకు దోహదపడ్డాయి. పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారంపై మళ్లీ దృష్టి సారించడం వలన మార్కెట్లో డిమాండ్ పెరిగింది.
నవంబర్ 1 ఉదయం 7 గంటల సమయానికి దేశవ్యాప్తంగా 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర ₹1,23,290గా నమోదైంది. ఇది నిన్నటితో పోలిస్తే సుమారు ₹1,000 పెరిగినట్టుగా ఉంది. 22 క్యారెట్ ఆభరణ బంగారం ధర కూడా ₹1,13,010కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం స్పాట్ ధర 4,004 అమెరికన్ డాలర్లుగా ఉంది.
వెండి ధరలు కూడా బంగారం ధోరణినే అనుసరిస్తున్నాయి. పరిశ్రమల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వెండి రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర ₹1,50,900గా ఉంది. ఎమ్‌సీఎక్స్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర ₹1.21 లక్షల వద్ద, వెండి ఫ్యూచర్స్ ధర ₹1.48 లక్షల వద్ద తచ్చాడుతున్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు దాదాపు సమానంగా ఉన్నాయి. చెన్నై, ముంబై, హైదరాబాద్, విజయవాడ, కేరళ తదితర ప్రాంతాల్లో 24 క్యారెట్ బంగారం ధర ₹1,23,290గా ఉంది. 22 క్యారెట్ ధర ₹1,13,010 కాగా, 18 క్యారెట్ ధర ₹92,470గా నమోదైంది. కిలో వెండి ధరలు కూడా చెన్నై, హైదరాబాద్, విజయవాడ, కేరళల్లో ₹1,64,900గా ఉండగా, ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో ₹1,50,900గా ఉన్నాయి.
నిపుణులు చెబుతున్నదేమిటంటే బంగారం ధరలు ప్రపంచ మార్కెట్ పరిస్థితులు, ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, డాలర్ మార్పిడి రేటు వంటి అంశాలపై ఆధారపడి మారుతుంటాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేయదలచిన వారు ప్రస్తుత ధరలను మరోసారి పరిశీలించడం మంచిదని సూచిస్తున్నారు. ఈ పెరుగుదల కొనసాగుతుందా లేదా అనేది రాబోయే వారాల్లో అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.