ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్. ఇప్పుడు ఏఐ తమకు తిరుగు లేదని భావించిన టెక్ ఇంజనీర్ల భవిష్యత్ పైన సందేహాలకు కారణం అవుతోంది. అన్ని రంగాల్లోనూ ఏఐ సేవలు విస్తరిస్తున్నాయి. ఏఐ నైపుణ్యం ఉన్న వారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యత దక్కుతోంది.
టెక్ కంపెనీల్లో ఏఐ కోడింగ్‌లో ఇంజినీర్ల భవిష్యత్ ఏంటనే చర్చ మొదలైంది. వరుసగా ప్రముఖ కంపెనీలే భారీగా ఉద్యోగాల కోతలు ప్రకటిస్తున్నాయి. ఏఐ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 140 కోట్ల [40 శాతం] ఉద్యోగాలపై ప్రభావం ఉంటుందని ప్రముఖ అధ్యయన సంస్థ వెల్లడించింది.
కీలక రంగాల్లో ఏఐ ప్రాధాన్యత, వాడకం అనూహ్యంగా పెరిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న కృత్రిమ మేధ మార్కెట్ విలువ 2033 నాటికి 4.8 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఇది ఇంచుమించు జర్మనీ ఆర్థిక వ్యవస్థ పరిమాణంతో సమానం.
అయితే తాజాగా యూఎన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ తెలిపిన వివరాల ప్రకారం ఏఐ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 140 కోట్ల [40 శాతం] ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇంజినీరింగ్ విద్య, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లపై ఏఐ ప్రభావం పడనున్నట్టు నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల అవసరం భారీగా తగ్గొచ్చని ఓపెన్‌ఏఐ సీఈవో ఆల్ట్‌మన్ అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే సగానికి పైగా టెక్ కంపెనీల్లో ఏఐ కోడింగ్‌ను రాస్తున్నదని స్పష్టం చేశారు. ఇంజినీరింగ్ ఉద్యోగాల అవసరం తగ్గుతుందని అన్నారు. ఒక్క ఏడాదిలో సాఫ్ట్‌వేర్ కోడ్‌లన్నింటినీ ఏఐ రాయగలదని ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమోడై చెప్పారు.
ఏఐ వినియోగంతో రాబోయే 18 నెలల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను పక్కకు తప్పించొచ్చు అని అమెరికాకు చెందిన సోషల్ క్యాపిటల్ సీఈవో పలిహపితియా అభిప్రాయపడ్డారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల భవిష్యత్తు ప్రమాదంలో ఉందని ఆయన హెచ్చరించారు. ఇంజనీర్ పాత్ర కనుమరుగు అయ్యే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేసారు.